Overeating : ఒత్తిడి, మూడ్ బాగాలేని కారణంగా మోతాదుకు మించి తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే
తమ అనుకున్న పనులు జరిగాయనో, ప్రమోషన్, పరీక్షల్లో పాసైన సందర్భాలు, ఉద్యోగం లభించటం వంటి భావోద్వేగ పూరిత సందర్భంలో ఆకలి తీరుపై సదరు భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో అధికంగా తినాలన్న కోరిక కలుగుతుంది.

Overeating due to stress and bad mood
Overeating : ఆకలేసినప్పుడు కాకుండా కొందరు ఏమీ తోచనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఏదిపడితే అది చెడామడ తినేస్తుంటారు. ఆసమయంలో తాము ఏం తింటున్నాం, ఎంతమోతాదులో తింటున్నాం అన్న విషయం ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటి పరిణామాలు అనేక అనర్ధాలకు కారణమౌతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఒక సాధారణ విధానం ఆహారం. ఇది కొంతమేర ఒత్తిడిని తగ్గించటానికి సహాయం చేసినప్పటికీ, తినడం వల్ల కలిగే సంతృప్తి పూర్తయ్యాక ఇంకా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. బరువు పెరగటం, కొవ్వులు పేరుకోవటం తద్వారా గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
మానసిక భావోద్వేగాలతో కుంగుబాటుకు గురైనప్పుడు తీసుకునే ఆహారానికి ఏమాత్రం పరిమితి లేకుండా పోతుంది. శారీరక ఆకలిని తీర్చడం కంటే భావోద్వేగాలను ఎదుర్కోవటానికి ఆహారం తీసుకోవటాన్ని ఎమోషనల్ ఈటింగ్ గా చెప్పవచ్చు. భావోద్వేగాలకు ప్రతిస్పందనగా తినడం బరువు హెచ్చుతగ్గులు, మానసిక ఆరోగ్యంతోపాటు, అనేక రుగ్మతలకు దారితీస్తుంది. భావోద్వేగాల కారణంగా ఆహారం మోతాదుకు తీసుకోవటానికి అనేక కారణాలు ఉంటాయి. డబ్బు విషయాలు, శారీరక రుగ్మతలు, కుటుంబ సంరక్షణ, ఇతరత్రా సమస్యలు వంటి కారణాలు ఉంటాయి. బాధపెట్టే వార్తలను విన్నప్పుడు, చూసినప్పుడు తెలియని ఆందోళన మొదలవుతుంది. ఆ సమయంలో ఆకలి వేయకపోయినా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది.
అదే క్రమంలో సానుకూల భావోద్వేగ ప్రతిస్పందన సమయంలో చాలా మంది అతిగా తినేస్తుంటారు. అనందకరమైన సమయాల్లో భావోద్వేగాలకు లోనై మోతాదుకు మించి ఆహారం తీసుకుంటారు. తమ అనుకున్న పనులు జరిగాయనో, ప్రమోషన్, పరీక్షల్లో పాసైన సందర్భాలు, ఉద్యోగం లభించటం వంటి భావోద్వేగ పూరిత సందర్భంలో ఆకలి తీరుపై సదరు భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో అధికంగా తినాలన్న కోరిక కలుగుతుంది. స్నేహితుడి పుట్టినరోజును జరుపుకునే సమయంలో కేక్ తింటే, అది కేవలం సామాజిక ఆహారం. అయితే ఆత్రుతగా లేదా ఒత్తిడికి గురై భోజనం చేస్తుంటే, అది మానసికమైన భావోద్వేగంతో తినడం కావచ్చు. సామాజికంగా తినడం, మానసికంగా తినడం మధ్య వ్యత్యాసం ఉంటుంది.
ఈ పరిస్ధితుల నుండి బయటపడాలంటే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి అలవరుచుకోవాలి. భావోద్వేగాలకు కారణం తెలుసుకుని దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. వ్యాయామం ఒత్తిడిని తగ్గించే మెదడులో రసాయన మార్పులకు కారణమవుతుంది. రోజూ క్రమం తప్పకుండా కాసేపు నడవడం, తోటపని, పుస్తకపఠనం, స్నేహితులతో మాట్లాడటం, సంగీతం వినడం వంటివి అలవరుచుకుంటే ఒత్తిడిని, భావోద్వేగాలను తగ్గించుకోవచ్చు.