హైదరాబాద్‌కు రష్యా కరోనా వ్యాక్సిన్.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి!

Russia Sputnik V Coronavirus : రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ (Sputnik V) కరోనా వ్యాక్సిన్ భారత్‌కు చేరింది. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో సంయుక్తంగా రెడ్డి ల్యాబ్స్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది.
భారత ప్రభుత్వం, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కు అంతా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చాయి.
దాంతో భారతదేశంలో పెద్ద ఎత్తున మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రెడ్డి ల్యాబ్స్ సన్నద్ధం చేస్తోంది. మూడో దశ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత వెంటనే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రష్యా తమ కరోనా వ్యాక్సిన్ 92 శాతానికి పైగా సమర్థవంతంగా పనిచేయగలదని ప్రకటించింది. ఫైజర్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత రష్యా సావరెన్ వెల్త్ ఫండ్ RDIF కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన జారీ చేసింది.
ఇటీవలే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగ్గా.. అందులో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని రష్యా పేర్కొంది. కరోనా సోకిన 20 బాధితులకు ప్లేసిబో తీసుకున్న వారికి స్పుత్నిక్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారికి సంబంధించి డేటాను RDIF వెల్లడించింది.