మరో రెండు : తెలంగాణలో మొత్తం జిల్లాలు 33

హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అందులో ఒకటి సమ్మక్క – సారలమ్మ ములుగు జిల్లాకాగా.. మరొకటి నారాయణపేట జిల్లా. మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి 9 మండలాలతో సమ్మక్క – సారలమ్మ ములుగు జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు కొత్తగా రెండు డివిజన్లు, నాలుగు మండలాలు కూడా ఏర్పాటుకానున్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆయా జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఈనెల 30దాకా స్వీకరించనున్నారు. వచ్చిన విజ్ఞప్తులను 15 రోజుల్లో పరిశీలించిన తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీంతో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఫిబ్రవరి 16వ తేదీ తర్వాత ఏర్పాటు కానున్నాయి. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది.