బిగ్ డెవలప్ మెంట్ : హైదరాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ఫ్లాంట్

తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం పరిశ్రమల విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు ఒక భారీ పరిశ్రమ వచ్చింది. ఒకవైపు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిపై చర్చ జరుగుతుంటే.. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్.. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం చర్చకు దారి తీస్తుంది. సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌కు చెందిన లీప్ టర్బోఫ్యాన్ ఇంజన్ కోసం అవసరమైన విడిభాగాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిలిప్ పెటిట్‌కోలిన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిసి ఆయన కొత్త ప్లాంట్ ఏర్పాటు విషయమై చర్చించి ప్రకటన చేశారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ కోసం 3.6 కోట్ల యూరోలు( భారతీమయ సుమారు రూ.290 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫిలిప్ తెలిపారు. 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అలాగే అందులో 8000చదరపు అడుగులలో వర్క్ షాప్ లను నిర్మిస్తున్నామని, తెలంగాణా ప్రభుత్వం ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఫిలిప్ తెలిపారు. ఈ ఏడాది ముగిసేవరకు 50 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని, అనంతరం ఉద్యోగుల సంఖ్యను 300కు పెంచనున్నట్లు ఆయన చెప్పారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సాఫ్రాన్.. భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమతో కలిసి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని అన్నారు.
ఈ సంధర్భంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ కోసం సాఫ్రాన్.. హైదరాబాద్‌ను ఎంచుకోవటం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పటికే పలు గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) హైదరాబాద్‌లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయటమే కాకుండా ఎగుమతులు ప్రారంభించాయని, ఈ జాబితాలో సాఫ్రాన్ కూడా చేరటం ఏరోస్పేస్ రంగానికి ఎంతగానో కలిసివస్తుందని ముఖ్యమంత్రి కేసిఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో ఏరోస్పేస్ రంగం కీలకంగా ఉందని, ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
లీప్ ఇంజన్ల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో తోడ్పాటునందించేందుకు 2023 నాటికి ఏటా 15 వేల విడిభాగాలను హైదరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు చెప్తున్నారు. సీఎఫ్‌ఎం ఈ ఏడాది 1,800 ఇంజన్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని 2,000కు పెంచే అవకాశం ఉందని చెప్పారు. లీప్ ఇంజన్లకు సంబంధించి ఇప్పటి వరకు 17వేలకు పైగా ఆర్డర్లు ఉన్నాయని, విమానయాన పరిశ్రమలో అత్యంత వేగంగా అమ్ముడుబోతున్న ఇంజన్లలో ఇది ఒకటని ఆ కంపెనీ సీఈఓ ఫిలిప్ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా చెయిన్‌ను పటిష్ఠం చేసే ఆలోచనతో వ్యూహాత్మకంగా భారత్‌లో కొత్త ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్లు ఆయన చెప్పారు.