తొందరపడ్డాను… క్షమించండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అనసూయ సారీ

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 08:31 AM IST
తొందరపడ్డాను… క్షమించండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అనసూయ సారీ

Updated On : September 13, 2019 / 8:31 AM IST

ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తన తప్పుని సరిదిద్దుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. తొందరపడ్డాను.. క్షమించండి అని కోరారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకి అనసూయ సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపింది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పకపోవడం హాట్ టాపిక్‌ అయ్యింది. కేంద్రం నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, నటీనటులు తీవ్రంగా వ్యతిరేకించారు. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమం స్టార్ట్ చేశారు. టాలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు మద్దతు పలికారు.
 
అలా స్పందించిన వారిలో అనసూయ కూడా ఉన్నారు. యురేనియం ప్రాజెక్ట్ వద్దంటూ ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులను ట్యాగ్ చేశారు. సరిగ్గా ఇక్కడే ఆమె తప్పులో కాలేశారు. పొరపాటు చేసి దొరికిపోయారు. ఏపీ విషయంలో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ట్యాగ్ చేసిన అనసూయ తెలంగాణ అటవీ శాఖ మంత్రి విషయంలో పొరబడ్డారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అయితే.. అనసూయ మాత్రం మాజీ అటవీ శాఖ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్నకు ట్యాగ్ చేశారు. దీంతో ఆమె ట్వీట్‌ ని తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు చేశారు. వెంటనే తన తప్పుని తెలుసుకున్న అనసూయ.. సరిచేసుకున్నారు. 

‘జోగురామన్న అటవీ మంత్రి అని ట్యాగ్ చేసినందుకు క్షమించండి. కరెంటు అఫైర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు.. పట్టులేదు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుపై ఆలోచించండి’ అని రెండోసారి ఇంద్రకరణ్‌రెడ్డికి ట్యాగ్ చేస్తూ అనూసూయ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా జోగురామన్న పనిచేశారు. రెండోసారి ఆయనకు కేబినెట్‌లో బెర్తు దక్కలేదు.