ఆంధ్రా బ్యాంక్ పేరు మార్పు బాధాకరం : మంత్రి హరీశ్ రావు

ఆంధ్రా బ్యాంక్ పేరు మారుతుండటం నాకు చాలా బాధగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆంధ్రా బ్యాంక్ శాఖను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలున్నది ఆంధ్రా బ్యాంక్ అని అటువంటి బ్యాంక్ పేరు మారుతుండటం బాధాకరమని అన్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో రైతులు, మహిళల అభివృద్దిలో ఆంధ్రా బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందనీ అటువంటి ఆంధ్రబ్యాంక్ పేరు మార్పు బాధను కలిగించే విషయమని అన్నారు.
కాగా..ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను విలీనం చేస్తున్న విషయం తెలిసిందే.దీంట్లో భాగంగా..బ్యాంకుల విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంట్లో భాగంగా..ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం అయ్యాయి. ఇప్పుడు మరో 10 బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాడనున్నాయి. ఆ పది బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పునాదులు వేసుకుని, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలు ఉన్న ఆంధ్రా బ్యాంకు కూడా ఒకటి. ఈ క్రమంలో ఆంధ్రా బ్యాంక్ ఇకపై కనుమరుగుకానుండటం బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు.