ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురిసే చాన్స్ ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. రాజధాని నగరంతోపాటు నాలుగు జిల్లాల్లో భారీవర్షం కురిసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఓ మోస్తరు వానపడింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 13 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాల్లో సాయంత్రం ఐదు గంటలకు మొదలైన వాన.. రాత్రి పది గంటలవరకు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి.