బటన్ నొక్కితే ఇడ్లీ రెడీ : హైదరాబాద్ టెక్కీల అద్భుత సృష్టి

మనం ఇంతవరకు కాఫీ,టీ, కూల్ డ్రింక్ వెండింగ్ మెషీన్లు , కొన్ని చోట్ల బీరు వెండింగ్ మెషీన్లు చూసాం. అలాగే బ్యాంకు ఖాతానుంచి డబ్బు తీసుకునేందుకు ఏటీఎం మెషీన్లు చూశాం. ఇప్పుడు ఇడ్లీ వెండింగ్ మెషీన్ కూడా వచ్చేసింది. అదీ మన హైదారాబాదీ యువ టెక్కీలు రూపోందించిన దేశీయ పరికరం. అదేంటో ఒకసారి చూద్దామా..
బటన్ నొక్కితే ఇడ్లీ, చట్నీ, సాంబార్ వచ్చే మిషన్ ను రూపోందించారు హైదజరాబాదు కు చెందిన 15 మంది యువ ఇంజనీర్లు. దాదాపు ఏడాదిన్నర శ్రమించి ఎనీటైంఇడ్లీ మెషీన్ రూపోందించారు. ఇందులో 80 ప్లేట్లు,160 ఇడ్లీలు నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉంది. ఇడ్లీలు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, సాంబార్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేసుకొనే సదుపాయం ఉంది. ఒక్కసారి బటన్ నొక్కితే 90 సెకండ్లలో అంతా పూర్తయి బయటకు వస్తుంది. ఇడ్లీ సాంబారు మిషన్లో ఏర్పాటుచేసేందుకు అరగంట సమయం పడుతుంది. ఈ విజయంతో త్వరలో పానీ పూరి వెండింగ్ మెషీన్ రూపోందించే పనిలో పడ్డారు మన టెక్కీలు. సాంకేతిక యుగంలో ప్రతిదీ మెషీన్లద్వారా అందుతున్నప్పుడు ఆహారపదార్ధాలు కూడా ఎందుకు అందిచలేమనే ఆలోచనతో రూపు దిద్దుకుందే ఇడ్లీమెషీన్ అంటున్నారు పొసిబులియన్ టెక్నాలజీస్ సీఈవో నాగుబండి అయ్యప్ప.
పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేసే ఈ యంత్రం ఏ సమయంలోనైనా వేడివేడి ఇడ్లీ, సాంబారు, చట్నీ అందిస్తుంది. సెంట్రల్ కిచెన్ కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఇడ్లీ మెషీన్ సెన్సార్లతో పనిచేస్తుంది. ఇడ్లీలు ముందుగానే వండి మెషీన్లో పెడతారు. 160 ప్లేట్లు యంత్రంలో ఉంచుతారు. ఇడ్లీ అయిపోగానే సెన్సార్లు అలర్ట్ చేయటం ద్వారా సమాచారం తెలుస్తుంది. వెంటనే అక్కడున్నవాళ్లు మళ్లీ ఇడ్లీలు నింపి అందుబాటులో ఉంచుతారు. నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత ఉండేందుకు అనువుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. వినియోగదారులకు రెండు ఇడ్లీ, సాంబార్ 100 మి.లీ, చట్నీ. 60 మి.లీ సాంబారు వచ్చేలా ప్రోగ్రామింగ్ చేశారు. ఇడ్లీతోపాటు ఒక స్పూన్ కూడా వస్తుంది. ఇందులో ఎక్కడా ప్లాస్టిక్ ఉపయోగించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
బేగంపేట రసూల్పురాలో ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ వెండింగ్ మెషీన్ లో డబ్బులు కూడా డిజిటల్ పద్దతిలో చెల్లించవచ్చు. మెషీన్ వద్ద ఏర్పాటు చేసిన బార్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మొదట మెషీన్ లో మనకు కావల్సిన ఇడ్లీలు ఆర్డర్ చేయాలి. వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దానికి సంబంధించి మనం గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తే మన ఆర్డర్ వస్తుంది. డబ్బులు చెల్లించాక మెషీన్ లో ఏదైనా సమస్యవస్తే ఆవిషయం మన మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఏదైనా కొత్తగా చేయాలి, వ్యాపారం చేస్తు లాభాలు సంపాదిస్తున్నా ప్రజలకు ఉపయోగ పడాలి అనే కోణంతో ఇడ్లీ ప్రియుల కోసందేశంలో మొదటి సారి స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు నిర్వాహకురాలు నాగలక్ష్మి నాగుబండి.
ప్రస్తుతం రసూల్పురాలో ఏర్పాటు చేశామని త్వరలోనే హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని ఆమె చెప్పారు. ఇడ్లీ వెండింగ్ మెషీన్ తయారీకు సాఫ్ట్ వేర్, ఎలక్ట్రికల్, మెకానికల్, డిజైనింగ్ బృందాలకు చెందిన యువ ఇంజనీర్లు పని చేశారు. ఇంకా మార్కెట్ లోకి రాని ఈ ఇడ్లీ మెషీన్ గురించి కార్పోరేట్ సంస్ధలు ఆసక్తి చూపించటం విశేషం . దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.idlimachine.com లో చూడవచ్చు.