దత్తన్నకు గవర్నర్ పదవి

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 06:08 AM IST
దత్తన్నకు గవర్నర్ పదవి

Updated On : September 1, 2019 / 6:08 AM IST

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా నియమించింది. 

కొన్ని రోజులుగా బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర నిర్ణయంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్..అభినందనలు తెలియచేశారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయనడానికి ఇదొక సూచకమంటున్నారు నేతలు. 

ఇక బండారు దత్తాత్రేయ విషయానికి వస్తే…1947 ఫిబ్రవరి 26న ఆయన జన్మించారు. ఆయన్ను దత్తన్నగా అందరూ వ్యవహరిస్తారు. 1965 బండారు దత్తాత్రేయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. 1968 నుంచి 1989 మధ్య ఆర్ఎస్ఎస్ పర్‌చారక్‌లో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంగా ఉన్న సమయంలో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 2004 మధ్య కాలంలో 10, 12, 13 లోక్ సభకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వాజ్ పేయి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 

కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ ఉద్వాసన పలికిన తర్వాత..ఆయనకు కీలక పదవి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కొన్ని ఏళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తున్న దత్తన్నకు బీజేపీ మొండిచేయి చూపింది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈయన విజయం సాధించారు.

దీంతో దత్తన్న పార్టీ మారుతారని తెగ ప్రచారం జరిగింది. కానీ తాను పార్టీ వీడడం లేదని ప్రకటించారు. దత్తన్న పార్టీలో సీనియర్. బీసీ వర్గానికి చెందిన వారు కూడా కావడంతో తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తే..గవర్నర్ పదవి ఆయనకు తప్పకుండా వస్తుందని పార్టీలో ప్రచారం జరిగింది. ఆయనకు గవర్నర్ పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.