నిధుల్లో, వాటాలో కేంద్రం కోత…అయినా ఆగదు సంక్షేమం

2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో, నిధుల బదలాయింపులో కోత పెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఆయన….తెలంగాణకు రావాల్సిన వాటాలో కేంద్రం 4.19 శాతం కోత విధించిందని తెలిపారు. మిగతా అన్నివిషయాల్లో కూడా ఇలాగే కోత విధించటం ద్వారా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందని చెప్పారు. దేశంలో మిగతా రాష్ట్రాల పరిస్ధితి మనకంటే అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు.
కాగ్ నివేదిక ప్రకారం కర్నాటక, పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాలు మైనస్ ఆదాయాభివృద్ది రేటును నమోదు చేసుకుని తిరోగమన దిశలో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ పరిస్ధితి గుడ్డిలో మెల్లలాగా కొంతలో కొంత నయం అనిపిస్తున్నదని కేసీఆర్ అన్నారు. స్ధిరమైన ఆర్ధిక ప్రగతి, పట్టుదల కలిగిన ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆర్ధిక పరపతితో ఇతర సంస్థలనుంచి నిధులు సమీకరించుకోగలుగుతోందని కేసీఆర్ వివరించారు.
భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆర్ధిక సంస్ధలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోందని కేసీఆర్ వివరించారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం యధాతధంగా కొనసాగుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక సంక్షోభంలోనూ ఉన్న పరిమితుల్లోనే పేదప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగిస్తామని సీఎం ప్రకటించారు. రైతుసంక్షేమం పట్ల ఉన్న చిత్తశుధ్దికి నిదర్శనం రైతు బంధు పధకం కింద ఎకరానికి ఇస్తున్నసాయాన్ని రూ.8వేలనుంచి రూ.10 వేలకు పెంచటమే అని రైతు బంధు యాధాతధంగా కొనసాగుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.