కరోనాపై యుద్ధం: ఆర్మీ తరహాలో డాక్టర్లకు డ్యూటీ!

కరోనాపై యుధ్ధం అంటే మాములు విషయం కాదు.. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుద్ధం చేసే వైద్యులకు కూడా ఇది అంటుకునే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు డాక్లర్లకు కోవిడ్-19 వచ్చింది అనే వార్తలు డాక్టర్లను భయానికి గురి చేస్తుండగా.. ఇప్పుడు ప్రభుత్వం ఆర్మీ తరహా విధానం ఆచరించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఉన్న వైద్య సిబ్బంది నుంచే రిజర్వుడు దళాన్ని ఏర్పాటు చెయ్యడానికి కృషి చేస్తుంది ప్రభుత్వం.
కరోనా కేసులకు చికిత్స అందిస్తోన్న వైద్యుల సేవలను దశల వారీగా వాడుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం.. అనుమానితులు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుండటంతో సర్కారు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బోధనా ఆసుపత్రుల్లో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది ఆరోగ్యశాఖ.
ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా వైద్యులకు ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిందంటే.. అది పూర్తిగా చికిత్స మీదే ప్రభావం చూపుతుంది. ప్రపంచంలోనే వైద్యంపరంగా గొప్పగా ఉన్న ఇటలీలోనే రోనా బాధితులకు వైద్యం చేసిన 14 శాతం మంది డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. అటువంటి పరిస్థితి మన డాక్టర్లకు రాకుండా కాపాడుకోవాలంటే వారందరి సేవలను ఒకేసారి కాక, కొందరిని రిజర్వులో పెట్టాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు ఆగిపోయాయి. కాబట్టి వైద్య సిబ్బంది ఆసుపత్రికి రోజూ వచ్చి కరోనా బాధితులకు చికిత్స చేయక్కర్లేదు. అందుకే రిజర్వుడు వైద్య దళాన్ని తయారుచేయాలని నిర్ణయించారు.
వైద్య దళం ఎలా సిద్ధం చేస్తారంటే.. ప్రస్తుతం గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఫీవర్, సరోజిని, ఉస్మానియా, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. బోధనాస్పత్రుల్లోనూ, జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లోనూ 20 ఐసోలేషన్, 10 పడకల ఐసీయూ వార్డులను సిద్ధం చేశారు. కరోనా సేవలందించే చోట సీనియర్ వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. డాక్టర్లందరి సేవలను ఒకేసారి కాకుండా దశల వారీగా వాడుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే డాక్టర్లకు సెలవులను కూడా రద్దు చేసింది.
డాక్టర్లందరికీ ఒకేసారి డ్యూటీ వేయకుండా.. ఒక ఆస్పత్రిలో ఉన్న సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది.. ఇలా మూడు కేటగిరీల నుంచి మూడు బ్యాచ్‌లు తయారుచేస్తారు. ఒక్కో బ్యాచ్ ఐదు రోజుల పాటు కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తుంది. ఈ బ్యాచ్‌లోని వారికి కూడా షిఫ్టుల వారీగా విధులు ఉంటాయి. ఒక బ్యాచ్ ఐదు రోజుల డ్యూటీ పూర్తి చేసుకున్నాక వారి స్థానంలో తదుపరి బ్యాచ్‌కు, ఆపై తరువాత బ్యాచ్‌కు విధులు అప్పగిస్తారు. తొలుత సేవలందించిన బృందంలో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? ఆరోగ్య సమస్యలు తలెత్తాయా అనేది పరిశీలించి, పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యులు మానసిక, పని ఒత్తిడికి గురికాకుండా చూసుకుంటారు. అన్ని పరీక్షలు చేశాక మొదటి బ్యాచ్ వైద్య సిబ్బందిని సెలవుల్లో రిజర్వుడుగా ఉంచుతారు. ఇలా 3 దశల్లో వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు.