ఈఎస్ఐ కేటుగాళ్లు : 10tv ఎక్స్‌క్లూజివ్ ఆడియో క్లిప్స్

ఈఎస్‌ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్ జిరాక్స్ తీసిన నిందితులు… అంకెలు పెంచి కొత్త ఇండెంట్లు తయారు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కాగా.. ఈ కేసుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఆడియో క్లిప్‌లను టెన్ టీవీ సంపాదించింది. కుదిరితే బతిమాలడం.. వినకపోతే బెదిరించడం.. లేదంటే ఇరికించడం.. ఇలా రెచ్చిపోయింది దేవికా గ్యాంగ్. దొంగ బిల్లులు సృష్టించడం.. డిస్పెన్సరీల నుంచి పెట్టిస్తూ.. కోట్లకు కోట్లను కొట్టేసింది. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణలు ఎక్స్‌క్లూజివ్‌గా 10tv సంపాదించింది.
దొంగబిల్లులు పెట్టడంలో ఆరితేరిపోయిన ఈఎస్‌ఐ దోపిడీ గ్యాంగ్… ఓ నకిలీ బిల్లును అసలు బిల్లుగా మార్చడానికి ఎంతగా ప్రయత్నించారో 10tv ఆధారాలతో సహా పట్టుకుంది. క్యాంప్‌లు నిర్వహించకుండానే… నిర్వహించామని చెప్పుకున్న తీరును వెలుగులోకి తెచ్చింది. అసలు క్యాంప్‌ల పేరుతో లేని బిల్లులను తెచ్చి.. డాక్టర్లతో రికార్డుల్లో ఎంట్రీ చేయించడానికి చేసిన ప్రయత్నాలు చేసింది.
ఈఎస్‌ఐ డైరెక్టరేట్ ఆఫీస్‌లో పనిచేసే ఫార్మాసిస్ట్ రాధికకు.. ఓ డిస్పెన్సరీలోని డాక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణతో మందుల కొనుగోలు బాగోతం బయటపడింది. డాక్టర్ వేసిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన సురేంద్రనాథ్.. తనను నడిపిస్తున్న వాళ్లతో చర్చలు జరిపాడు. ఏకంగా 50 లక్షల రూపాయల నకిలీ బిల్లును… నిజమైన బిల్లుగా మార్చడానికి వాళ్లతో కలిసి కొత్త ప్లాన్ వేశాడు. డాక్టర్‌తో ఒక్క రిజిస్టర్‌లో ఎంటర్ చేసి ఇస్తే.. రికార్డుల్లో మార్చేయడానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. మరి.. ఆ డాక్టర్ వేసిన ప్రశ్నలేంటి? సురేంద్రనాథ్ చెప్పిన సమాధానాలేంటి? ఆ కాల్ రికార్డ్స్‌ను కూడా 10tv టీమ్ సంపాదించింది.
మరోవైపు ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ కూడా 10tvకి చిక్కింది. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 44 పేజీల రిమాండ్ డైరీలో దేవికారాణి, పద్మ, వసంతలు కలిసి స్కాం చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. డిస్పెన్సరీ నుంచి డిమాండ్ లేకపోయినా మందుల కొనుగోళ్లు జరిపినట్లు… మందులను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేసినట్లుగా నకిలీ బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. మందుల్ని కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి 11 కోట్లు దోచుకున్నట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.
Read More : ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?