50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు : ఎలక్షన్ కోడ్

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 04:49 PM IST
50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు : ఎలక్షన్ కోడ్

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.

హైదరాబాద్ : ప్రయాణాలు చేస్తున్నారా.. లేక షాపింగ్ చేద్దాం అని ఇంటినుంచి బయటకు వెళ్తున్నారా… అయితే కాస్త నిబంధనలు తెలుసుకోండి. ఎందుకంటే… ఎక్కడైనా చెకింగుల్లో 50 వేలకు మించి నగదు దొరికితే ఇక మీ ఖర్మ. ఎలా వచ్చిందో లెక్క చెప్పకుంటే.. పోలీసులు పట్టుకెళ్లిపోతారు. అవును.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి… లెక్కల్లో తేడా వస్తే కటకటాలు లెక్కించాల్సిందే అంటున్నారు పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో… వెంట నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు అధికారులు. 50వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్లకూడదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే మాత్రం… పక్కాగా లెక్క చూపించాలి. దానికి తగ్గ ఆధారాలు చూపించాలి. లేదంటే… పోలీసులు ఆ నగదును సీజ్ చేస్తారు. ఐటీ అధికారులకు అప్పగిస్తారు. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు, సామాగ్రి పంపిణి చేసి ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే… ఎలాంటి ప్రలోభాలకు అస్కారం లేకుండా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను.. అధికారులు ఆంక్షలు విధించారు. వ్యాపారమైనా.. లేక ఇతర పనుల కోసం నగదు తీసుకెళ్తే మాత్రం ఆధారాలు చూపించాలి.. అప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును తిరిగిస్తారు. ఎవరైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బిల్లు చెల్లించడానికి భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే, సదరు రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రశీదులు వెంబడి ఉండాలి.

మరోవైపు అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో డే అండ్ నైట్ చెకింగులు చేస్తున్నారు. 45 ప్రత్యేక బృందాలు నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు నిత్యం తనిఖీలు చేస్తున్నాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలోనూ కోట్ల రూపాయల నగదు లభించింది. హైదరాబాద్ పరిధిలో… 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 195 కేసులు నమోదుకాగా… చూపని 29 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల నిబంధన కేవలం నగదు తరలింపునకు మాత్రమే వర్తిస్తుందనుకుంటే పొరపాటే అవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున బంగారం, వెండి కొనుగోలు చేసినా, గిరివి పెట్టినవి విడిపించినా.. వాటి రశీదులు వెంట తీసుకెళ్లాల్సి వుంటుంది. 2018 ఎన్నికల సమయంలో 3 కోట్లకు పైగా విలువైన బంగారం, వెండి పట్టుబడింది.. 120 కేసులకు సంబంధిం ఛార్జిషీట్లు నమోదయ్యాయి. 

అయితే… పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నా అందరూ సహకరించాల్సిందే అంటున్నారు పోలీసులు. అటు వ్యాపారులు కూడా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని ఆదేశిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో హవాలా మార్గంలో నగదు రవాణా జరుగుతుండటంతో ఆ దిశగానూ పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు… సున్నిత ప్రాంతాల్లో ఒకటైన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ స్పెషల్ టీములు తనిఖీ చేస్తున్నాయి. 37 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలతో పాటు అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు.