పదవుల పంపిణీ : నేతల హామీల అమలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పదవుల పంపిణీ మొదలైంది. నేతలకు నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో టీఆర్‌ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున పదవులు దక్కనున్నాయని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికార పార్టీ నేతలకు కొత్త ఏడాది పదవులతో స్వాగతం పలుకుతోంది. ఇంతకు ముందు కార్పొరేషన్ చైరన్లుగా పనిచేసిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు.. అసెంబ్లీకి ఎన్నికవడంతో పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆ స్థానాన్ని పార్టీ సీనియర్ నేత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో భర్తీ చేశారు.
రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన వేముల ప్రశాంత్‌రెడ్డి
మిషన్ భగీరథకు కొత్త ఛైర్మన్‌ను నియమించే అవకాశం
టీఆర్‌ఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా కొత్త నేతలకు ఛాన్స్
పదవుల పంపకాల ప్రారంభంతో టీఆర్‌ఎస్‌లో కొత్త జోష్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆ స్థానాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి రెండో సారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఈసారి మిషన్ భగీరథకు కొత్త చైర్మన్‌ను నియమించే చాన్స్ ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ చైర్మన్‌గా ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. పదవుల పంపిణీ ప్రారంభం కావడంతో టీఆర్‌ఎస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మరిన్ని పదవులు భర్తీ చేసే అవకాశం వుంది. ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించరాదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవులతో పాటు దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కానున్ననేపథ్యంలో రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున పదవులు దక్కనున్నాయి. ఆశావహులు యువనేత కేటీఆర్‌ని ప్రసన్నం చేసుకొని పదవులు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.