పంచాయతీ ఎన్నికల తుది పోరు
తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరుగనున్నాయి.

తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరుగనున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరగనున్నాయి. మూడో విడతతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. జనవరి 21న మొదటి, జనవరి 25న రెండో విడత ఎన్నికలు పూర్తయ్యాయి. జనవరి 30న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బుధవారం పంచాయతీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగనుంది. అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్ విధుల నిర్వహణకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల సేవలనువినియోగించుకుంటున్నారు.
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని (హైదరాబాద్ మినహా) పబ్లిక్, ప్రైవేట్ అండర్ టేకింగ్స్, పారిశ్రామిక, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సంస్థల యాజమాన్యాలు స్థానికంగా ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఆయా సంస్థలు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకునేందుకు వీలుగా మరో సెలవు రోజును పనిదినంగా పరిగణించవచ్చునని సూచించింది. అది సాధ్యం కాకపోతే ఓటు వేసేందుకు వీలుగా ఓటింగ్ సమయాల్లో 3 గంటల పాటు వెసులుబాటు కల్పించవచ్చునని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులిచ్చారు.
మూడో విడత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీతో పాటు ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు నిఘా పెంచారు. మంగళవారం వరకు రూ.1.95 కోట్ల మేర నగదు, దాదాపు రూ.65 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.