కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు అరెస్ట్.. వాట్సప్ గ్రూప్ అడ్మిన్లూ జాగ్రత్త

భూంకపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు.. ఇంకా ఏవేవో.. ప్రపంచం నాశనం అయిపోతుంది. అప్పుడెప్పుడో ఎవరెవరో చెప్పేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కలియుగం అంతం అయిపోయింది. కరోనాతోనే అంతం.. అంటూ ఒకటా? రెండా? బోలెడు వార్తలు.. ఏందీ ఇవన్నీ నిజం అని నమ్ముతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. కాదు.. కాదు.. తప్పులో కాలేసినట్లే.. సోషల్ మీడియా ప్రభావం పెరిపోయాక ఏదైనా ఒక విషయం ట్రెండింగ్‌లో ఉంటే దాని గురించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కూడా తయారైపోతారు.
అయితే ఇప్పుడు కరోనా విషయంలో కొత్త కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న జ్వరం వచ్చినా.. దగ్గినా కూడా కరోనా వచ్చిందంటూ వాట్సప్‌లో వార్తలు వైరల్ చేస్తున్నారు కొందరు. లేటెస్ట్‌గా అలా తప్పుడు ప్రచారం చేసిన ఐదుగురు అరెస్ట్ అయ్యారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసుల నుంచి ఆదేశాలు జారీ అయినా, కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలోనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిని గుర్తించారు పోలీసులు. తెలంగాణలో రెండు జిల్లాల్లో ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళకు కరోనా సోకిందని వాట్సాప్ గ్రూపులో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తీసుకురాగా.. ఆమెకు కరోనా సోకిందని, తాండూరులో మొదటి కేసు నమోదైందంటూ కొర్విచెడ్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ వాట్సాప్ గ్రూపులో ఫేక్ పోస్టు పెట్టాడు.
ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ విభాగం సిబ్బంది విచారణ జరిపి విజయ్‌కుమార్‌ను గుర్తించింది. అతనితో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న బాల్‌రాజ్‌పైన ఐపీసీ 188, సెక్షన్ 54 ఎన్‌డీఎంఏ కింద కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా బాల్‌రాజ్ ఓ వెబ్ చానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్ అర్బన్ కమలాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.రవిరాజు వెల్లడించారు.
ఇక ఏపీలో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసిన వారికి ఏపీ ప్రభుత్వం రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించనుంది. ఐపీసీలోని సెక్షన్ 270 ప్రకారం కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోనున్నారు. మన తెలుగునాట కరోనాపై పిచ్చి తప్పుడు న్యూస్ ప్రచారం చేస్తే మాత్రం తప్పించుకోలేరు. గుర్తుంచుకోండి అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఇక వాట్సప్‌లో గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాట్సప్‌లో తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్‌లు కూడా బాధ్యత వహించాలి అని, అలా కాకుండా ఉండాలంటే మత్రం ప్రైవసీ సెట్టింగులు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
See Also | గడప దాటని పల్లెలు : లాక్ డౌన్ కు మద్దతు