మరికొద్దిసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్

  • Published By: murthy ,Published On : December 1, 2020 / 05:45 AM IST
మరికొద్దిసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్

Updated On : December 1, 2020 / 5:56 AM IST

ghmc elections 2020 polling today : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం గం.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.  9,101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించారు.



కరోనా వైరస్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్‌ సమయాన్ని గంట పెంచారు.

మరో వైపు……  బూత్‌కు వెళ్లిన ఓటర్లు కొవిడ్‌ నిబంధనలను అత్యంత జాగ్రత్తగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు  సూచించాయి. పోలింగ్‌ బూత్‌కు మాస్కు ధరించి రావడం తప్పనిసరి అని.. ఓటేసేందుకు లైన్‌లో నిలబడినప్పుడు భౌతిక దూరం పాటించాలని, బ్యాలెట్‌ను ముట్టుకున్నాక చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. చేతులకు గ్లౌజ్ లు‌ ధరించి పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడం ఇంకా మంచిదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.



ఎన్నికల్లో 28,683 బ్యాలెట్‌ పెట్టెలను సిద్ధం చేయగా, 81,88,686 బ్యాలెట్‌ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. ఈ సారి ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ పెట్టెలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూంలకు తరలించనున్నారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్‌ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు.

డిసెంబర్‌ 4న ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఇక ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, దుకాణాలు, ఇతర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా సెలవు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఓటర్లు జీహెచ్‌ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో పనిచేస్తుంటే, ఓటేసేందుకు అవకాశం కల్పించేలా వారి పనివేళల్లో కొంత రిలీఫ్‌ కల్పించాలని పరిశ్రమలు, ఇతర సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.