సంక్రాంతి రద్దీ : హైదరాబాద్ రోడ్లా.. బెజవాడ హైవేనా

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 02:02 AM IST
సంక్రాంతి రద్దీ : హైదరాబాద్ రోడ్లా.. బెజవాడ హైవేనా

నల్గొండ: నగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నెంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్‌ సిబ్బంది, పోలీసులు  చర్యలు తీసుకున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. 2019, జనవరి 12వ తేదీ శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

జాతీయ రహదారి 65 రద్దీగా మారింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంచు కూడా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 10కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ముందుగా వచ్చే టోల్ గేట్ పంతంగి టోల్ ప్లాజా. ఇక్కడ మొత్తం 16 గేట్లు ఉంటాయి. ఇందులో 16 గేట్లను హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాల వారి కోసం ఓపెన్ చేశారు. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చే వారి కోసం 5 గేట్లు ఓపెన్ చేశారు. సాధారణ రోజుల్లో 5 నుంచి 6 గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. సంక్రాంతి పండగతో వాహనాల రద్దీ పెరగడంతో 10 గేట్లు ఓపెన్ చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా రోడ్డెక్కడంతో జాతీయ రహదారి 65 రద్దీగా మారింది. సంక్రాంతి సెలవులు, వారాంతం కావడంతో ఒక్కసారిగా జనాలు సొంతూళ్లకు పయనం అయ్యారు.