పొగ మంచుతో ప్రమాదాలు : 16 వాహనాలు ఢీ

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 02:28 AM IST
పొగ మంచుతో ప్రమాదాలు : 16 వాహనాలు ఢీ

హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి మరో కష్టం వచ్చి పడింది. హ్యాపీగా సొంతూరికి వెళ్లి పండగ చేసుకుందామనే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు విపరీతమైన రద్దీ, ట్రాఫిక్ జామ్‌లతో రోడ్లపై నరకం చూస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు టెన్షన్ పెడుతోంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విజిబులిటీ స్థాయి దారుణంగా పడిపోయింది. 50 మీటర్ల దూరంలో ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో నేషనల్ హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్-బెంగళూరు హైవే 44పై 2019, జనవరి 12 తేదీ శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికొకటి వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

ఈ ఘటన ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రమాదాల తీరుని తలపించింది. నందిగామ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తగిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చెప్పింది. జనవరి 16వ తేదీ వరకు ఇలాగే పొగమంచు కమ్మేసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది. వాహనదారులు తెల్లవారుజాము ప్రయాణాలు వాయిదా వేసుకోవడం బెటర్ అని చెప్పారు. ప్రమాదాలను నివారించేందుకు ‘2 సెకన్ల విరామం’ విధానాన్ని అనుసరించడం సురక్షితం అని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో సేఫ్ జర్నీలపై దృష్టి సారించాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే నాలుగైదు రోజులూ పొగమంచు ఉంటుందని వాతావరణశాఖ తెలిపినందున ప్రజలు రాత్రి, తెల్లవారుజాము ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు.. ఉదయం 7-8 గంటల తర్వాతే జర్నీలకు ప్లాన్ చేసుకోవాలన్నారు.