ఎండలు పెరుగుతున్నా తగ్గని స్వైన్ ఫ్లూ : పెరుగుతున్న కేసుల సంఖ్య

  • Published By: chvmurthy ,Published On : March 18, 2019 / 02:28 AM IST
ఎండలు పెరుగుతున్నా తగ్గని స్వైన్ ఫ్లూ : పెరుగుతున్న కేసుల సంఖ్య

హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ్గలేదు.   చలికాలంలో విజృంభించే  వైరస్ ఎండలను తట్టుకుని  ఉంటోందని వైద్యులు చెపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో  గడిచిన 45 రోజుల్లో 573 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపిన నివేదికలో తెలిపింది. కాగా వీరిలో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది.  ఇటీవల 2 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధితో ఇద్దరు మరణించారు. 

గతేడాది దేశవ్యాప్తంగా 14వేల 992 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా 1 , 103 మంది మరణించారు.  కాగా…..ఈ ఏడాది రెండున్నర నెలల  కాలంలో 20 వేల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా వీరిలో 605 మంది చనిపోయారు. గతేడాది కాలంగా 14వేల పైగా కేసులు నమోదు కాగా,  కేవలం  ఈఏడాది రెండున్నర నెలల కాలంలో నమోదైన కేసుల సంఖ్య చూస్తుంటే వ్యాధి తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అనే ఆందోళన కల్గిస్తోంది. 
Read Also : స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

2014 లో   తెలంగాణ రాష్ట్రంలో  78 కేసులు నమోదు కాగా వారిలో 8 మంది మరణించారు.  2015 లో 2వేల 956 కేసులు నమోదు కాగా  100 మంది మరణించారు. ప్రభుత్వం  తీసుకున్న నివారణ చర్యల వల్ల  2019 లో ఇప్పటి వరకు రాష్ట్రంలో818 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 మంది మృతి చెందారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రజలు సమూహాంగా ప్రచారంలో పాల్గోంటుంటారు. భారీ బహిరంగ సభలు జరుగుతుంటాయి.  జనాలు గుంపులు  గుంపులుగా ఉన్న సమయంలోనే స్వైన్ ఫ్లూ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలంలో ఏమీ కాదన్న ధీమాతో ఉంటే పరిస్ధితి  అదుపుతప్పే ప్రమాదం ఉంది. గుంపులు,గుంపులుగా ప్రజలు  సంచరించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   
Read Also : కేరళలో కొత్త వైరస్ : పిల్లలు చచ్చిపోతున్నారు, ఆందోళనలో ప్రజలు