Krishna Leela Review : ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ.. గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మలో పోరాటం..

కృష్ణలీల సినిమా నేడు నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజయింది.(Krishna Leela)

Krishna Leela Review : ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ.. గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మలో పోరాటం..

Updated On : November 6, 2025 / 5:30 PM IST

Krishna Leela Review : దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటించగా బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి ఈ సినిమాని నిర్మించారు. కృష్ణలీల సినిమా రేపు నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజవుతుండగా నేడు ప్రీమియర్స్ వేశారు.(Krishna Leela)

కథ విషయానికొస్తే.. విహారి(దేవన్) అమెరికాలో ఓ టాప్ యోగా గురువు. తన చెల్లి పెళ్లి కోసం ఇండియాకు వస్తాడు. బృంద(ధన్య బాలకృష్ణ) హోమ్ మినిస్టర్ కూతురు. బృందకు అబ్బాయిలంటే కోపం. తన తండ్రి కాలేజిలోనే చదువుతుండటంతో అబ్బాయిలను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విహారి చెల్లి పెళ్ళిలో బృందని చూస్తాడు. ఆమెని చూడగానే మాట్లాడాలని ప్రయత్నించడంతో బృంద తిట్టేసి వెళ్ళిపోతుంది. బృందని చూసిన దగ్గర్నుంచి విహారి ప్రేమలో పడటంతో పాటు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. బృందని ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నించినా తను తిట్టి కొట్టి, కొట్టించి వెళ్ళిపోతుంది.

విహారి తల్లితండ్రులు(బబ్లూ పృథ్వీ – రజిత) బృంద నాన్న(వినోద్ కుమార్)తో పెళ్లి గురించి మాట్లాడదామని వెళ్తే అవమానించి పంపిస్తాడు. దీంతో విహారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను హోమ్ మినిష్టర్ కూతుర్ని చంపేసాను అంటాడు. పోలీసులు ఎంక్వేరి చేస్తే బృంద బతికే ఉంటుంది. అడిగితే విహారి తనని గత జన్మలో చంపాను అనడంతో పోలీసులు ఆశ్చర్యపోతారు. అసలు గత జన్మలో బృంద – విహారి ఎవరు? బృందకు కూడా గత జన్మ గుర్తొస్తుందా? విహారి ప్రేమని బృంద ఒప్పుకుంటుందా? పోలీసులు ఏం చేసారు? బృంద నాన్న పెళ్ళికి ఒప్పుకుంటాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

సినిమా విశ్లేషణ..

గత జన్మ ప్రేమ ఈ జన్మలో సాగడం లాంటి కథాంశం అప్పుడెప్పుడో జానకి రాముడు నుంచి మగధీర వరకు చాలా సినిమాల్లో చూసేసాం. ఈ కృష్ణ లీల కూడా అదే కథాంశం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ పాత్రల పరిచయాలు, విహారి బృంద కోసం తిరగడం, పోలీస్ స్టేషన్ కి వెళ్లడం సీన్స్ తో సాగుతుంది. సీన్స్ సాగదీశారు అనే ఫీలింగ్ వస్తుంది. కాలేజీలో ధన్య సీన్స్ మరీ ఓవర్ గా అనిపిస్తాయి. హీరో ఓ హోర్డింగ్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే డైలాగ్స్ చెప్పి ఓ ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకుంటాడు కానీ సరైన కారణం చెప్పడు.

బృంద కోసం విహారి ప్రయత్నాలు రొటీన్ లవ్ స్టోరీలలాగే ఉంటాయి. మధ్యలో గత జన్మ ఏదో ఉంది అంటూ లీడ్ ఇచ్చిన సీన్స్ ఆసక్తి నెలకొల్పుతాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్లి హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపాను అని చెప్పడం, గత జన్మలో అని చెప్పడం ఈ సీన్స్ తో సినిమాపై కాస్త ఆసక్తి నెలకొనేలా చేస్తాయి. ఇంటర్వెల్ లో గత జన్మలో ఏం జరిగింది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మొదట్లో గత జన్మ సగమే చూపించి మిగిలిన సగం క్లైమాక్స్ వరకు దాచడంతో ఏమైంది అనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది.

గత జన్మ లవ్ స్టోరీ కూడా రొటీన్ అయినా పాత్రలు కొత్తగా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక బృందకి నేను ప్రపోజ్ చేయాలి, అందుకు ఆమె నన్ను కలిసేలా చేయాలి అని విహారి కోర్టుకు పిటిషన్ వేయడం లాంటి సీన్స్ కొత్తగా ఉంటాయి. క్లైమాక్స్ కాస్త కొత్తగానే ఉంటుంది. సినిమాలో శివుడు, శివతత్వం గురించి చెప్పి టైటిల్ కృష్ణలీల అని ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. నటీనటులు ఒక్కొక్కరు ఒక్కో యాసలో మాట్లాడటంతో వింతగా ఉంటుంది. భాష, యాస పై కాస్త దృష్టి పెట్టాల్సింది.

Krishna Leela

నటీనటుల పర్ఫార్మెన్స్.. హీరోనే దర్శకత్వం వహించడంతో పాటు దేవన్ రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించడానికి బాగానే కష్టపడ్డాడు. ధన్య బాలకృష్ణ మోడ్రన్ పాత్రలో, ఫ్లాష్ బ్యాక్ లో గ్రామీణ యువతిగా బాగా నటించింది. బబ్లూ పృథ్వీ, రజిత జంట తల్లితండ్రులుగా కొత్తగా ఉంది. రజిత కొన్ని సీన్స్ లో ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ హోమ్ మినిస్టర్ పాత్రలో నెగిటివ్ రోల్ లో బాగానే మేపించారు. సరయు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Bad Girl Review : ‘బ్యాడ్ గర్ల్’ మూవీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా.. ఈ జనరేషన్ అమ్మాయిల గురించా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు సెట్ అవ్వలేదు. భీమ్స్ సిసిరోలియో ఎప్పుడో పాత మ్యూజిక్స్ అన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. పాటలు కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్ లో చాలా సీన్స్ షార్ప్ కట్ చేస్తే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ లో సెట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేసింది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. పాత కథకే దైవత్వం జోడించి కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేసారు దర్శకుడు. నిర్మాణ పరంగా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కృష్ణలీల’ సినిమా గత జన్మలో ఆగిపోయిన ప్రేమ కోసం ఈ జన్మలో ఏం చేసారు అని డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.