కాయ్ రాజా కాయ్ : IPL 2019 బెట్టింగ్‌లు..అరెస్టులు

క్రికెట్ జరుగుతుందంటే చాలు బెట్టింగ్‌ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్ అయినా, ప్రపంచకప్ అయినా చివరికి వన్డే సిరీస్ అయినా బెట్టింగ్‌లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్‌ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వరకు ఎన్నికలపై జోరుగా బెట్టింగ్స్ సాగాయి. ఏపీలో ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్‌లకు మాఫియా తెరలేపింది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు ఫలానా చోట ఫలానా వారు గెలుస్తారంటూ జోరుగా బెట్టింగ్స్ కాచారు. ఈ సమయంలోనే వచ్చిన ఐపీఎల్ మ్యాచ్‌ను బుకీలు వదల్లేదు. ప్రతి మ్యాచ్‌పైనా బెట్టింగ్స్ వేస్తూనే ఉన్నారు. మే 12వ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటూ పలుచోట్ల బెట్టింగ్స్ జరిగాయి.
కడప జిల్లాలో : –
కడప జిల్లా జమ్మలమడుగులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య జరుగుతుండడంతో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నాగులకట్ట వీధిలో సోదాలు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు లక్షల 30వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ కోలా కృష్ణన్ తెలిపారు. ముందుగా అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మిగిలిన ఆరుగురి సమాచారం తెలిసిందన్నారు. వీరిని మే 13వ తేదీ సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
గుంటూరు జిల్లాలో : –
గుంటూరు జిల్లాలోనూ ఐపీఎల్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్స్ జరిగాయి. సత్తెనపల్లిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న కోల్‌కతాకు చెందిన అబీర్‌చంద్ అనే బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులే లక్ష్యంగా వారితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అబీర్‌చంద్ బ్యాంక్ ఖాతాలో ఉన్న ఏడు లక్షల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారి సైన్‌ఘోష్ కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్, టెన్నిస్, హార్స్ రేసింగ్ తదితర ఆరు ఆటల్లో జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్‌లో కనీసం వందమంది పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో : –
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీమాన్, సన్నీకుమార్ జైస్వాల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25వేల నగదు, రెండు కంప్యూటర్ సిస్టమ్స్, రెండు మొబైల్ ఫోన్స్, పోర్టబుల్ టీవీ, సెటప్‌బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు.