ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆస్తులు : తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్లపై ఫోకస్ పెట్టిన ఐటీ శాఖ అధికారులు.. వారి ఆస్తుల్లో వ్యత్యాసాలను గుర్తించారు. వారి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలుసుకున్నారు. ఇంతగా ఆస్తులు ఎలా పెరిగియో చెప్పాలని నోటీసుల్లో కోరారు. 2014 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లోని ఆస్తుల వివరాలకు, 2018 ముందస్తు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో పొందుపర్చిన ఆస్తుల వివరాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రజాప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఆదాయం ఐదేళ్లలో వందల రెట్లు పెరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు ఎమ్మెల్యేలను కోరారు.
వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ నోటీసులతో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. లెక్కల చిక్కుల నుంచి తప్పించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆడిటర్లని ఆశ్రయిస్తున్నారు. 119మంది ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.