బాబు వల్లే నాశనం అయ్యాం : కోమటిరెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అన్నారు. తనలాంటి వాళ్ల ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అన్నారు. మహాకూటమి వద్దని తాను ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే 40 నుంచి 45 స్థానాలు కాంగ్రెస్ గెలిచేదన్నారు.
కూటమే కారణం:
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతో ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని కోమటిరెడ్డి విశ్లేషించారు. కూటమి గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యత పెరుగుతుందన్న టీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మారని చెప్పారు. అధిష్టానం టికెట్ ఇస్తే పార్లమెంటుకు పోటీ చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు లేకుండా, టీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి పోటీ చేస్తే.. కాంగ్రెస్ 7 నుంచి 8 ఎంపీ స్థానాలు గెలుస్తుందని కోమటిరెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని తాను కుంతియాకు గట్టిగా చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు.
ప్రజలు కన్‌ఫ్యూజ్ అయ్యారు:
టీడీపీతో పొత్తు కారణంగా ఏ టికెట్ ఎవరికి వస్తుందో తెలియదు, ఏ బీఫామ్ ఎవరికి పోయిందో తెలియని పరిస్థితులు తలెత్తాయని.. దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారని కోమటిరెడ్డి అనాలసిస్ చేశారు. కేసీఆర్ ఎంత గోల్‌మాల్ చేసినా కాంగ్రెస్ కచ్చితంగా 45 నుంచి 50 సీట్లు గెలుస్తుందని తాను అనుకున్నానని, కానీ కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓడిపోతుందని అస్సలు ఊహించలేదన్నారు. కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి మనలో తప్పులు ఉన్నాయని, ఆ తప్పులు మరోసారి చేయొద్దని కుంతియాతో చెప్పడం జరిగిందన్నారు. టీడీపీతో పొత్తు వల్లే ఓడిపోయామని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో సంచలనంగా మారాయి. కోమటిరెడ్డి కామెంట్స్‌తో తమ్ముళ్లు షాక్ తిన్నారు.