టీవీ9కి కొత్త టీం : CEO మహింద్ర మిశ్రా, COO గొట్టిపాటి సింగారావు

టీవీ9 సంస్థను కొత్త యాజమాన్యం టేకోవర్ చేసింది. బోర్డు మీటింగ్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఈవో, సీవోవోగా ఉన్న రవి ప్రకాష్, మూర్తిల తొలగింపునకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. టీవీ 9 కొత్త సీఈవోగా కన్నడ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేంద్ర మిశ్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించారు. వీరిద్దరూ టీవీ9లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏబీసీఎల్ డైరెక్టర్స్ ఈ మేరకు సమావేశం అయి టీవీ9కు కొత్త సీఈవో, సీవోవోలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీవీ9లో 90.50 శాతం వాటాను అలంద మీడియా టేకోవర్ చేసినట్లు వెల్లడించారు. అన్ని భాషల్లోని టీవీ9 ఛానల్స్ ను తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ప్రారంభించిన హిందీ ఛానల్ భారత్ వర్ష్ కూడా టీవీ9 కిందకే వస్తుందని స్పష్టం చేశారు డైరెక్టర్ సాంబశివరావు. ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యథావిధిగానే టీవీ9 వ్యవహారాలు నడుస్తాయని వివరించారు. టీవీ9ను మరింత విస్తరించటానికి కూడా ప్రయత్నాలు చేస్తాం అన్నారు. రవి ప్రకాష్ కు టీవీ9తో సంబంధం లేదని ప్రకటించారు. ఆయన షేర్ హోల్డర్ గానే ఉన్నారని వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతరత్రా వ్యవహారాల్లో టీవీ9కి సంబంధించి రవి ప్రకాష్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.