మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వలేం – హైకోర్టు

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 08:06 AM IST
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వలేం – హైకోర్టు

Updated On : May 16, 2019 / 8:06 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు..దాని అనుబంధ ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పట్లో స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. నిర్వాసితుల కేసుపై హైకోర్టులో మే 16వ తేదీ గురువారం విచారణ జరిగింది. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం జాప్యం వహించిందని కోర్టు పేర్కొంది.

ప్రాజెక్టు మొత్తం 4 వేల 108 ఎకరాలకు గాను..4 వేల 061 ఎకరాలకు నష్టపరిహారం అందచేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే 47 ఎకరాల్లో ఉన్న బాధితులు నష్టపరిహారానికి నిరాకరించారని వెల్లడించారు. బాధితుల చెక్‌లను ప్రభుత్వ తరపు అడ్వకేట్ కోర్టుకు డిపాజిట్ చేశారు. 47 ఎకరాల కోసం పెద్ద ప్రాజెక్టు పనులను ఆపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని, నష్టపరిహారాన్ని బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.