ఉన్మాదిగా మారిన ఆటో డ్రైవర్: నలుగురిని చంపేశాడు

  • Published By: vamsi ,Published On : December 9, 2019 / 02:35 AM IST
ఉన్మాదిగా మారిన ఆటో డ్రైవర్: నలుగురిని చంపేశాడు

Updated On : December 9, 2019 / 2:35 AM IST

ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి భార్య మీద కోపంతో, ఆమె కుటుంబంపై పగ పెంచుకుని నలుగురిని చంపేశాడు. అనంతరం ఉన్మాది చివరికి ఉరి వేసుకుని చనిపోయాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండగ్రామానికి చెందిన లక్ష్మీరాజ్యం(40) అనే ఆటో డ్రైవర్‌.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన విమలను పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.  అయితే అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట కోర్టులో భార్య భరణం కోసం వ్యాజ్యం దాఖలు చేసింది. దీనికి సంబంధించి విచారణ కోర్టులో కొనసాగుతోంది.

ఇటీవల పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మూడుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా కూడా ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఆటో డ్రైవర్ లక్ష్మీరాజ్యం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అత్తగారింటికి వెళ్లి తలుపులు పగలగొట్టి గదిలో నిద్రిస్తున్న భార్య విమల(37), కుమార్తె పవిత్ర(11), కుమారుడు జయపాల్‌, బావమరిది జాన్‌రాజ్‌(38), ఆయన భార్య రాజేశ్వరి(32), వదిన (విమల అన్న సతీమణి) సునీతలపై పెయింట్ థిన్నర్( పెయింట్లో కలిపే లిక్వీడ్) పోసి టపాసులు కాల్చి విసిరేశాడు.

మంటలు చెలరేగడంతో జయపాల్‌ మినహా అందరూ గాయపడ్డారు. అదేరోజు విమల, మూడ్రోజుల వ్యవధిలో పవిత్ర, జాన్‌రాజ్‌, రాజేశ్వరి చనిపోయారు. సునీత చికిత్స పొందుతోంది.  నిందితుడిని అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. తప్పించుకోలేనని భావించిన లక్ష్మీరాజ్యం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో మర్రి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.