కార్పొరేట్ డాక్టర్ల నిర్వాకం : వేలు చికిత్స కోసం వస్తే ప్రాణాలే తీసారు

హైదరాబాద్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవటం లేదు ప్రయివేటు ఆస్పత్రులు. వేలికాలికి చికిత్స కోసం వస్తే ఏకంగా మనిషి ప్రాణం కోల్పోయిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ప్రయివేటు ఆస్పత్రిలో జరిగింది. కొత్తగూడెం..రామవరానికి చెందిన సంగీతరావు అనే 53 ఏళ్ల వ్యక్తి ఎడమకాలి చిటికెన వేలిలో రక్తం గడ్డకట్టింది. దీంతో స్థానిక సింగరేణి ఆస్పత్రికి వెళ్లగా మెరుగైన చికిత్స కోసం విరించి ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో మార్చి 14న విరించి ఆస్పత్రి వైద్యులు టెస్ట్ చేసిన వేలికి బ్లడ్ సర్య్కులేషన్ నిలిచిపోయిందనీ..ఆపరేషన్ చేయాలనటంతో సంగీతరావు ఆపరేషన్ చేయించుకుంటానన్నాడు. మార్చి 22న చిటికెన వేలికి ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని తీసివేశారు డాక్టర్లు.
సర్జరీ తరువాత సంగీతరావు ఎంతకీ స్పృహ రాకపోవటంతో బంధువులు డాక్టర్లను అడుగగా ఆపరేషన్ సమయంలో ఇచ్చిన మత్తుమందు ప్రభావం ఇంకా ఉందనీ భయపడాల్సిన పనిలేదన్నారు. కానీ ఆ మరుసటి రోజు కూడా అతను స్పృహలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వైద్యులను నిలదీశారు. సంగీతరావు కోమాలోకి వెళ్లాడనీ ఐసీసీయూలోకి తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యులు బంధువుల్ని నమ్మించారు. తరువాత ఆదివారం సంగీతరావు మృతి చెందాడని చెప్పారు. దీంతో దిగ్భ్రాంతికి లోనైన బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే సంగీతరావు మృతి చెందాడని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
కానీ జరిగిన విషయం బైటకు చెప్పకుండా విరించి ఆస్పత్రి యాజమాన్యం చనిపోయిన సంగీతరావు మృతదేహాన్ని బంధువులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసుల సహాయంతో గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలియటంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేస్తారని భయంతో ముందే పోలీసులు భారీగా అక్కడ మోహరించడం, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల కంప్లైంట్ తో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోపక్క విరించి ఆస్పత్రి డాక్టర్ మాట్లాడుతు..దీంట్లో తమ తప్పేమీ లేదనీ..సంగీతరావు షుగర్..హైపర్‌టెన్షన్, రెస్ట్‌ఫెయిన్ సమస్యలు ఉన్నాయనీ..స్మోకింగ్ అలవాటు కూడా ఉందనీ..దీంతో స్పెషలిస్ట్ ల టీమ్ అతడికి సర్జరీ చేసిందనీ..సర్జనీ అనంతరం శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావటంతో ఐసీయూకు తరలించి చికిత్స చేశామని కానీ కార్డియో ఫల్మొనరీ అరెస్ట్‌తో సంగీతరావు మృతి చెందాడనీ దీంట్లో తమ పొరపాటు ఏమీ లేదంటున్నారు.