మత్తయ్య ఆవేదన : ఓటుకు నోటు కేసులో బలిపశువునయ్యా

  • Published By: chvmurthy ,Published On : January 29, 2019 / 04:32 PM IST
మత్తయ్య ఆవేదన : ఓటుకు నోటు కేసులో బలిపశువునయ్యా

Updated On : January 29, 2019 / 4:32 PM IST

ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు జెరూసలేం మత్తయ్య.  మంగళవారం ఆయన  మాట్లాడుతూ ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో  కానీ  విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ ,ఎన్ఐఏతో విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలతారని, ఓటుకు నోటు కేసులో నన్ను బలిపశువును చేశారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, తన నిర్దోషిత్వాన్ని చాటుకోవడానికే సుప్రీంకోర్టుకి వచ్చాను అని చెప్పారు. 

 

ఓటుకు నోటు కేసులో నన్ను ఏ4 గా చేర్చడం ఇంకా మిస్టరీగానే ఉందని, ప్రభుత్వాలు నన్ను ఇబ్బందులకు గురిచేసాయని అన్నారు. నాకు జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే ఢిల్లీలో ధర్నా చేస్తానని మత్తయ్య అన్నారు.సుప్రీంకోర్టులో నా వాదనలు నేనే వినిపించుకోవాలని భావించినప్పటికీ అమికస్ క్యూరిని నియమించి వాదనలు వినిపించే అవకాశం లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమికస్ క్యూరి అయిన సిద్దార్థ దవే నా తరుపున వాదించాల్సి ఉన్నా అమ్ముడుపోయి, నాకు పాస్ రాకుండా చేసారని ఆరోపించారు. “కుట్ర పూరితంగానే ఉదయ సింహ నా పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యాడు. పట్టుబడ్డ దొంగలందరు ఈ కేసులో ఇంప్లిడ్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నా.ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లు కూడా నా పిటిషన్లో ఇంప్లిడ్ అవ్వాలి” అని జెరూసలేం మత్తయ్య అన్నారు.

సుప్రీంకోర్టులో ఈరోజు ఓటుకు నోటు కేసు విచారణ జరగాల్సి ఉండగా ప్రతివాది ఉదయసింహా తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు హాజరుకాలేదు. తన తల్లికి తీవ్ర అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరుకావడంలేదని న్యాయవాది లేఖ పంపించారు. దీంతో కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.