హైదరాబాద్ లో మరో శిల్పారామం : బంజరు భూమిలో కళాకృతులు

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 06:01 AM IST
హైదరాబాద్ లో మరో శిల్పారామం : బంజరు భూమిలో కళాకృతులు

Updated On : February 22, 2019 / 6:01 AM IST

హైదరాబాద్‌ : బంజరు భూమి  అందమైన శిల్పారామంగా రూపొందింది. అల్లిబిల్లిగా అల్లుకున్న మొక్కల స్థానంలో రంగురంగుల వేదిక రూపాంతరం చెందింది. ఏప్రిల్ 6న తెలుగువారి పండుగ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ మినీ శిల్పారామం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  
 

నగర ప్రజలకు గ్రామీణ ప్రాంతాన్ని, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తున్న శిల్పారామం తరహాలోనే మరొకటి నగర శివారు ప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది. ఉప్పల్‌ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. 2018లో అప్పటి మున్సిపల్ డెవలప్ మెంట్ మంత్రిగా పనిచేస్తున్న  కేటీఆర్ చేతుల మీదుగా ఈ కళా వేదికకు మొదటి అడుగు పడింది. 

ఈ ఉగాదికల్లా మినీ శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉప్పల్‌-నాగోల్‌ ప్రధాన రహదారికి సమీపంలో, నాగోల్‌ మెట్రో రైలు డిపో దగ్గర, మూసీనది వెంట మినీ శిల్పారామాన్ని నిర్మిస్తున్నారు. ఉప్పల్‌ భగాయత్‌ లేఔట్‌ పక్కనే గల 9.5 ఎకరాల విశాలమైన స్థలాన్ని ఇందుకోసం కోసం హెచ్‌ఎండీఏ కేటాయించడంతో పాటు రూ.10కోట్లతో పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. ఈ పనులను టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయి.

హైటెక్‌ సిటీ ప్రాంతంలోని శిల్పారామానికి ఉన్న ప్రధాన ఆర్చ్‌ తరహాలో ఉప్పల్‌ శిల్పారామానికి ఆర్చ్‌ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ వస్తువులు, చేనేత వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇక్కడ 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించే ప్రతీ స్టాల్‌ గ్రామీణ నేపథ్యాన్ని, గ్రామీణ కళలు, సంస్కృతులు కళాకారులను ప్రోత్సహించే విధంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యాంటీన్‌ను కూడా అట్టహాసంగా ఏర్పాటు చేస్తున్నారు.

మూసీనది వెంటనే శిల్పారామం నిర్మాణం చేపడుతుండడంతో దుర్గంధం రాకుండా ప్రత్యేకమైన మొక్కలను పెంచుతున్నారు. 9.5ఎకరాల స్థలంలో ల్యాండ్‌స్కే్‌పలను ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది కూర్చునేందుకు అనువుగా ప్రత్యేకమైన ఓపెన్‌ థియేటర్‌ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చే లోపు ఈ మినీ శిల్పారామాన్ని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 

Read Also:గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు
Read Also:సీరియల్ నటి ఘనకార్యం : దోమల్ని చంపబోయి.. ఇల్లు కాల్చేసుకుంది