చల్లని వార్త : జూన్ 8 నుంచి తెలంగాణలోకి రుతు పవనాలు

ఎండలతో మండిపోతున్న తెలంగాణ వాసులకు చల్లని వార్త. 2019లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ రెండోవారంలోనో తెలంగాణను తాకనున్నాయని ఇండో-జర్మన్ ప్రాజెక్టులో భాగమైన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రిసెర్చ్ (PIK) సంస్థ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8 నుంచి 16వ తేదీ మధ్య నైరుతి రుతుపవనాలు మొదలయ్యే అవకాశముందని PIK ప్రొఫెసర్ ఎలెనా సురోవ్యతినా తెలిపారు. తూర్పు కనుమలు, తూర్పు దక్షిణ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమప్రాంతం, ఉత్తర తెలంగాణ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పీఐకే తెలిపింది. టిప్పింగ్ ఎలిమెంట్ విధానంతో 2016 నుంచి వినూత్న తరహాలో నిర్వహిస్తున్న వాతావరణ పరిశోధనలు వాస్తవమయ్యాయని PIK తెలిపింది. వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ నాయకత్వంలోని ఇండో-జర్మన్ ప్రాజెక్ట్ విజయవంతంగా వాతావరణ పరిశోధనలను నిర్వహిస్తోంది.
గత 2016 నుంచి రెండేళ్లుగా వాతావరణ మార్పులను PIK కరెక్ట్ గా అంచనా వేయగలుగుతోంది. PIK సంస్థ తూర్పు కనుమలు, మహారాష్ట్ర, ఉత్తర పాకిస్థాన్ మధ్య గాలిలో తేమ శాతం బాగా ఎక్కువగా ఉన్న సమయంలోను..ఉష్ణోగ్రతలు అతి ఎక్కువగా నమోదైనప్పుడు టిప్పింగ్ ఎలిమెంట్ పద్ధతిలో ఏర్పడనున్న వాతావరణాన్ని అంచనా వేస్తుంది. తూర్పు కనుమలు ఉత్తర ఒడిశా నుంచి ఏపీ, తమిళనాడు వరకు విస్తరించి ఉంటాయి. భారత వాతావరణ విభాగం సాధారణంగా కేరళను తాకే నైరుతి రుతుపవనాలను, వర్షపాతాలను పరిగణనలోకి తీసుకుని వాతావరణాన్ని అంచనా వేస్తుంటుంది. PIK మాత్రం ఇందుకు భిన్నంగా పరిశోధిస్తుంటుంది. తూర్పు కనుమలు, తెలంగాణ పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండింటి మధ్య వాతావరణంలో వ్యత్యాసం ఉందని పీఐకే పరిశోధనలో వెల్లడయ్యింది.
అరేబియా సముద్ర ప్రభావం ఒక ప్రాంతంపై ఉంటే మరో ప్రాంతంపై బంగాళాఖాతం ప్రభావం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో కొన్నిచోట్ల రుతుపవనాలు ఏకకాలంలో వచ్చినా..మరికొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి పదిరోజుల వ్యత్యాసం ఉంటుందని PIK వెల్లడించింది. అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు తుఫాన్లు రుతుపవనాల గమనాన్ని కొన్నిరోజుల పాటు అడ్డుకుంటాయని..టిప్పింగ్ ఎలిమెంట్ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారని ఎలెనా తెలిపారు. కాగా 2016, 2017లో కూడా రుతుపవనాల ఆగమనం, ఉపసంహరణ విషయంలో PIK వెల్లడించిన ముందస్తు అంచనాలు వాస్తవాలయ్యాయని ఎలేనా తెలిపారు.