రక్షణ లేదా : జూనియర్ డాక్టర్లపై మరో దాడి

జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి 24 గంటలు గడువక ముందే వారిపై మరోసారి దాడి జరిగింది. నిమ్స్‌లో ఓ రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. రోగి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ దాడి చేశారు. దీంతో మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. యశోద అనే 75 సంవత్సరాల వృద్ధురాలు 4 రోజుల క్రితం క్రిటికల్ పొజిషన్‌లో నిమ్స్‌లో వైద్యం కోసం చేరారు. ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు. యశోదకు ఎమ్మారై చేస్తుండగా ఆమె చనిపోయారు.
యశోద మృతికి వైద్యులే కారణమంటూ ఆమె బంధువులు డాక్టర్లపై దాడికి దిగారు. అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్లను తోసివేశారు. అంతటి ఆగకుండా వారిపై దాడి చేశారు. తమపై దాడిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు ముందు ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమ్స్‌కు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. జూనియర్ డాక్టర్ల ధర్నా సమాచారం తెలుసుకున్న డైరెక్టర్ వారితో చర్చలు జరిపారు. రక్షణ చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని కోరారు. మార్చి 11లోపు డిమాండ్స్‌ను నెరవేర్చుతామని హామీనివ్వడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించారు.