లోకల్ వార్ : రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 04:03 AM IST
లోకల్ వార్ : రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

Updated On : January 24, 2019 / 4:03 AM IST

హైదరాబాద్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం అయింది. పోలింగ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 3,342 సర్పంచి స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. 10,668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు  కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌ ఈ నెల 21వ తేదీన ముగియగా, రెండో విడతకు 25న, మూడో విడతకు 30న ఎన్నికలు జరగనున్నాయి. 

మొదటి విడతలో వినియోగించిన బ్యాలెట్‌ పెట్టెల్లోని బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో వాటినే ఈ విడతలోనూ వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో పాల్గొన్న పోలింగ్‌ సిబ్బందే రెండో విడతలోనూ విధులు నిర్వహిస్తారు. మొదటి విడతలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కారణంగా రెండో విడతలో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.