3 రోజుల్లోనే పాస్ పోర్ట్ విచారణ

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 03:38 AM IST
3 రోజుల్లోనే పాస్ పోర్ట్ విచారణ

Updated On : August 28, 2019 / 3:38 AM IST

టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగిస్తూ నగర ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులు ప్రస్తుతం పాస్‌పోర్ట్‌ విచారణ ప్రక్రియ కూడా 3 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ‘వెరీఫాస్ట్‌’ పేరుతో తయారుచేసిన సాప్ట్‌వేర్‌ సాయంతో హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఈ వేగాన్ని అందుకున్నారు. నగరంలో దరఖాస్తుదారు ఎక్కడున్నా సరే ఇంటికి వెళ్లి విచారణ ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం వారు చెప్పిన వివరాల్లో నిజానిజాలను నిర్ధరించుకుని రిపోర్ట్ ను ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి పంపుతున్నారు.

విచారణ ప్రక్రియను దరఖాస్తుదారులు తెలుసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేక పోలీసు విభాగం అధికారులు, సిబ్బందికి ఇతర విధులు చాలా ఉన్నా పాస్‌పోర్టు ప్రాధాన్యం దృష్ట్యా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ఇలా చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. విచారణకు వెళ్లేవారు డబ్బులు తీసుకున్నా, బహుమతులు స్వీకరించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ఏటా సగటున 1.12లక్షల దరఖాస్తులు వస్తున్నాయని గుర్తించారు. విచారణ ప్రక్రియ చేపట్టే ప్రత్యేక విభాగంలో అధికారుల, సిబ్బంది సంఖ్యను పెంచారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం, మింట్‌ కాంపౌండ్‌ పాస్‌పోర్టు విచారణ కేంద్రం వద్ద దరఖాస్తుదారుల పడిగాపులు సైతం తగ్గాయి. పాస్‌పోర్టు విచారణ ప్రక్రియను మూడురోజులకు తగ్గించాలన్న లక్షాన్ని నిర్దేశించుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.