16 ఏళ్ళ కృషి ఫలితం పద్మభూషణ్ అవార్డు : పీవీ సింధు తల్లి విజయ

  • Published By: chvmurthy ,Published On : January 26, 2020 / 11:08 AM IST
16 ఏళ్ళ కృషి ఫలితం పద్మభూషణ్ అవార్డు : పీవీ సింధు తల్లి విజయ

Updated On : January 26, 2020 / 11:08 AM IST

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.  71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ  ఆ వివరాలను జనవరి 25న వెల్లడించింది. ఏడుగురిని పద్మవిభూషణ్‌, 16 మందిని పద్మభూషణ్‌, 118 మందిని పద్మశ్రీ వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికైన వారిలో పీవీ సింధుతో సహా ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నారు. పీవీ సింధుకు పద్మభూషణ్‌, వెంకట్‌రెడ్డి, విజయసారథికి పద్మశ్రీ లభించాయి. 

తెలుగు తేజం పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం రావడం పట్ల ఆమె తల్లి విజయ సంతోషం వ్యక్తం చేశారు. సింధు 16 ఏళ్ల కష్టానికి ఫలితంగా ఇది భావిస్తున్నామని ఆమె అన్నారు. ఈ అవార్డుతో సింధులో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె చెప్పారు. పద్మభూషణ్ పురస్కారంతో వచ్చే ఒలింపిక్స్ లో పీవీసింధు పతకం సాధిస్తుందని విజయ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇంత చిన్నవయస్సులో ఈ గౌరవం దక్కటం చాలా సంతోషాన్ని కలుగ చేసిందని మా కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఉన్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు వస్తూ ఉంటే ప్లేయర్స్ లో కొత్త ఉత్సాహం వస్తుందని, రెట్టింపు ఉత్సాహంతో మనదేశానికి మరిన్ని మెడల్స్ తీసుకు రాగలుగుతారని విజయ అన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందని ఆమె ఔత్సాహిక క్రీడాకారులకు చెప్పారు. సింధు భవిష్యత్తులో బ్యాడ్మింటన్ లో వరల్డ్ నెంబర్ వన్ స్ధానానికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు.