రాజాసింగ్ రగడ : ఆయనుంటే అసెంబ్లీకే రాను

హైదరాబాద్: కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉంటే… తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనని తేల్చి చెప్పారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన రాజాసింగ్… స్పీకర్ ఎంపిక తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. న్యాయపరంగా సమస్యలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే పార్టీ నుంచి గెల్చిన వ్యక్తిని నేను అని రాజాసింగ్ చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అసెంబ్లీలో తాను ప్రమాణస్వీకారం చేయనని చెప్పారు.
గౌరవం ఇవ్వాల్సిందే:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. వందకు పైగా స్థానాల్లో బీజేపీ పోటీచేస్తే.. రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణస్వీకారం చేయను అన్నారు. అవసరం అనుకుంటే అసెంబ్లీకి కూడా వెళ్లను అని రాజాసింగ్ తేల్చి చెప్పారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. రాజాసింగ్ వ్యాఖ్యలను పలువురు నాయకులు తప్పుపడుతున్నారు. ప్రొటెం స్పీకర్ అనేది గౌరవమైన పదవి అని, ఆ పదవిలో ఎవరున్నా గౌరవం ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.
ఖానే సీనియర్:
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో అందరికన్నా సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. ఎంఐఎం నుంచి చార్మినార్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన సీనియార్టిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఖాన్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.