ఘోర ప్రమాదం జరిగి 43రోజుల తర్వాత : బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తిరిగి ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : January 4, 2020 / 07:20 AM IST
ఘోర ప్రమాదం జరిగి 43రోజుల తర్వాత : బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తిరిగి ప్రారంభం

Updated On : January 4, 2020 / 7:20 AM IST

హైదరాబాద్ నగరంలో ఇటీవల మూతపడిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి ప్రారంభించారు. 2019, నవంబర్‌ 23వ తేదీన ఈ ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరిగినప్పటినుంచి ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. అనంతరం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు 43 రోజుల తర్వాత తిరిగి ఫ్లై ఓవర్‌పై వాహానాల రాకపోకలకు 2020 శనివారం, జనవరి4 నుంచి అనుమతులు ఇచ్చారు.  ఈరోజు ఉదయం ఫ్లై ఓవర్‌ను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ…. ప్రమాదం జరిగిన తర్వాత 43 రోజుల పాటు ఫ్లై ఓవర్‌ను మూసివేశామని…శనివారం జనవరి 4వతేదీ నుంచి వంతెనపై రాకపోకలు  పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని…ఫ్లై ఓవర్ మీద 40 కి.మీ. కంటే  మించి స్పీడ్ వెళ్ళరాదని మేయర్ వివరించారు. స్పీడ్ లిమిట్‌ కంట్రోల్‌ కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

కెమెరాలు, స్పీడ్‌ గన్స్‌, వేగ నియంత్రికలు ఏర్పాటు చేశామని బొంతు రామ్మోహన్‌  చెప్పారు. ఫ్లై ఓవర్ పై  వాహనాల వేగం, వాహనదారుల ప్రవర్తనను నెల రోజుల పాటు పరిశీలిస్తామని మేయర్‌ చెప్పారు. రోజువారీగా నివేదికను నిపుణుల కమిటీకి పంపిస్తామన్నారు. నివేదిక తర్వాత నిపుణుల కమిటీ సూచన మేరకు మరిన్ని ఏర్పాట్లు చేస్తామని మేయర్‌ చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్లై ఓవర్‌పై సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలు దిగకుండా సైడ్‌ వాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు మేయర్‌. వంతెనపై సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తామని బొంతు రామ్మోహన్‌ హెచ్చరించారు.