ఓటుకు నోటు కేసు : ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 08:05 AM IST
ఓటుకు నోటు కేసు : ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి

Updated On : February 19, 2019 / 8:05 AM IST

తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకునోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గతవారం ఇదే కేసు విషయంలో వేం నరేందర్ రెడ్డి హాజరు కాగా ఇప్పుడు ఇదే కేసు విషయమై కేసుకు సంబంధించిన పత్రాలతో రేవంత్ రెడ్డి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. 2015 మే 30వ తేదీన తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. 
    
    అప్పుడు తెలంగాణా తెలుగుదేశం కార్యనిర్వహణ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి..  తమ పార్టీ అభ్యర్ధి అయిన వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బు ఇచ్చి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంత్రబాబు హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తరువాతి కాలంలో తెలంగాణా తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం బాగలేకపోవడంతో రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.