లైఫ్‌తో గేమ్స్, బతుకులు ఆగమాగం

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 06:50 AM IST
లైఫ్‌తో గేమ్స్, బతుకులు ఆగమాగం

Updated On : December 11, 2020 / 10:23 AM IST

Rummy heist : ఎంత జరుగుతున్నా.. ఎన్ని జరుగుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మోసపోతామని తెలిసినా.. డబ్బు సంపాదనపై ఆశ.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఇష్టం ఇట్టే జనాల్ని బుట్టలో పడేస్తోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్స్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎంతోమంది అప్పులు చేసి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. నిషేధం ఉన్నా.. ఆఫ్‌లైన్‌లోనూ రమ్మీ ఆడేసి నష్టపోతున్నారు. అంతా అయ్యాక పోలీస్‌ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.



ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ బాధితులు పెరిగిపోతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్స్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అందులో ఆన్‌లైన్ రమ్మీ ఒకటి. బెట్టింగ్‌లు పెడుతూ.. గేమ్స్ ఆడుతూ లక్షల్లో కోల్పోతున్నారు బాధితులు. ఫలితంగా చేసిన అప్పులు తీర్చలేక.. ఏం చేయాలో తోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ను ఆడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా వినేవారు కరవయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీపై బ్యాన్ విధించింది. పోలీసులు కూడా రమ్మీ లాంటి గేమ్స్ ఆడకూడదని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.



అయినా ఇవేమీ పట్టని యువత.. వాటిని పెడచెవిన పెడుతోంది. ఇక హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అంబర్‌పేటకు చెందన ఓ వ్యక్తి ఆన్‌లైన్ రమ్మీ ఆడి అక్షరాలా 70 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అంతా అయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గేమ్‌ను బ్యాన్‌ చేసినా.. లింక్‌ ఎలా ఓపెన్‌ అయిందని పోలీసులు ఆరా తీయగా.. ఫేక్ జేపీఎస్ ద్వారా రమ్మీ ఆడానని బాధితుడు తెలిపినట్లు తెలుస్తోంది.



ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసులు భారీగా నమోదవుతుండగా.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇకమీదైనా.. ఆన్‌లైన్‌ గేమ్స్ జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌లో అత్యధికంగా రమ్మీని ఆడుతున్నారని.. రమ్మీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.