పల్లె బాట : రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు కిటకిట

హైదరాబాద్: తెలుగువారికి ముఖ్యమైన, పెద్ద పండగ సంక్రాంతి. సొంతూళ్లో సంక్రాంతి జరుపుకోవాలని అంతా ఆశపడతారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా వాళ్లు. ఏపీలో సంక్రాంతి పండగని చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. ఏ పండక్కి వెళ్లినా, వెళ్లకపోయినా సంక్రాంతికి మాత్రం కచ్చితంగా వెళ్తారు. అదనపు ఛార్జీల భారం భరించడానికి కూడా వెనుకాడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఊరికి వెళ్లాల్సిందే. సంక్రాంతి పండక్కి లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. 2019, జనవరి 12వ తేదీ శనివారం నుంచి సెలవులు కావడంతో నగరవాసులు పల్లె బాట పట్టారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ ఆర్టీసీ బస్టాండ్లు జనసంద్రంగా మారాయి. ప్రధాన సర్కిల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రయాణ ప్రాంగణాలు కూడా రద్దీగా ఉన్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సిటీ బస్సులను కూడా వినియోగిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు నడుపుతున్నారు.
సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు 3,673.. సీమాంధ్ర ప్రాంతానికి 1,579 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
* ఎంజీబీఎస్ నుంచి ఏపీకి 500 బస్సులు, తెలంగాణకు 855 బస్సులు
* జేబీఎస్ నుంచి ఆంధ్రాకు 230, తెలంగాణకు 1,426 బస్సులు
* కేపీహెచ్‌బీ నుంచి ఆంధ్రాకు 323, తెలంగాణకు 113 బస్సులు
* ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి ఆంధ్రాకు 20, తెలంగాణకు 454, ఎల్‌బీ నగర్ నుంచి ఆంధ్రాకు 156, తెలంగాణకు 825 బస్సులు
లక్షలాది వాహనాలు రోడెక్కడంతో హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దోపిడీకి తెరలేపారు. ప్రయాణికుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు. మామూలు రోజుల్లో 600 రూపాయలున్న టిక్కెట్‌ను 2,500 రూపాయల వరకూ పెంచేశారు. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, చిత్తూరు, బెంగళూరుకు టికెట్ ధరలు భారీగా పెంచేశారు. రైల్వే అధికారులు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా.. ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్- విజయవాడ మధ్య ఏకంగా 60 రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశారు. జనసాధారణ్ రైళ్లలో హైదరాబాద్- విజయవాడకు కేవలం రూ. 120 చార్జీ నిర్ణయించారు. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు.