తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను 22 రోజుల్లోనే పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలో తెలియజేస్తూ నిబంధనలు తయారు చేసింది. ఎన్నికలకు వారం రోజులు ముందే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులు ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను నూతన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్‌ను రద్దు చేసే అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. జడ్పీటీసీ అభ్యర్థి ప్రచార ఖర్చు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ. 1.50 లక్షలుగా నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే…ఎస్టీ, ఎస్సీ, బీసీలకు డిపాజిట్ సొమ్మును సమం చేసింది. బీసీల నుంచి 50శాతం డిపాజిట్, జనరల్ అభ్యర్థుల నుంచి పూర్తి డిపాజిట్ తీసుకోనుంది.
పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరైనా చనిపోతే ఎన్నికను వాయిదా వేసే అధికారం ప్రిసైడింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఈసీ తెలిపింది. నామినేషన్ ఆమోదం పొందిన అభ్యర్థులు, నామినేషన్లు ఉపసంహరించుకోకుండా చనిపోయినా, పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించకముందు చనిపోయినా పోలింగ్‌ను వాయిదా వేయవచ్చు. అయితే పోలింగ్ ప్రారంభమైన తర్వాత చనిపోతే వాయిదా వేయడానికి వీల్లేదు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్లు జాబితా అందకపోయినా పోలింగ్‌ను రద్దు చేయవచ్చు.
నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న విధంగా తెలుగు అక్షర క్రమంలో అభ్యర్థుల జాబితా తయారు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఇంటి పేరు పేర్కొనకుండా పొడి అక్షరంతో వ్రాస్తే పరిగణలోకి తీసుకోరాదని సూచించారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉంటే నామినేషన్ల సంఖ్య రాయాలని, వారి విద్య, నివాసం, వృత్తి లేదా స్థానికంగా పిలిచే పేరును జత చేస్తే దాని ప్రకారం గుర్తులను కేటాయించాలని అధికారులకు సూచించింది ఈసీ. పోలింగ్ రోజు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఎన్నికలకు వారం రోజులు ముందుగానే స్లిప్పులు పంపిణీ చేయాలని ఆదేశించింది.