గుజరాత్ బాటలో ఇద్దరు ‘చంద్రులు’
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈబీసీ 10 శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు ప్రారంభించాయి. ఈ చట్టం అమలుపై నిర్ణయాన్ని ప్రకటించిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ నిలవగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ రెండో స్థానం, ఏపీ మూడో స్థానంలో నిలవనుంది.

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈబీసీ 10 శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు ప్రారంభించాయి. ఈ చట్టం అమలుపై నిర్ణయాన్ని ప్రకటించిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ నిలవగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ రెండో స్థానం, ఏపీ మూడో స్థానంలో నిలవనుంది.
-
ఈబీసీ 10 శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు
-
తొలి స్టేట్ గుజరాత్.. రెండు తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్
-
త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం..
హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థిక బలహీన వర్గాల పేదల (ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును జనవరి 12న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా ఆమోదం తెలపడంతో చట్టంగా రూపుదాల్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019, జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చినట్లు సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి సందర్భంగా ఈ చట్టాన్ని జనవరి 14 నుంచి అమలు చేస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజునే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈబీసీ 10 శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు ప్రారంభించాయి. అయితే ఈ చట్టం అమలుపై నిర్ణయాన్ని ప్రకటించిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ నిలవగా.. తరువాతి స్థానాల్లో తెలంగాణ రెండో స్థానం, ఏపీ మూడో స్థానంలో నిలవనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈబీసీ చట్టం అమలుపై త్వరలో కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఈ కోటా అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంత రూల్స్ అమలు చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. ఏపీ రాష్ట్రంలో కొత్త కోటాను అమలు చేసే నిబంధనలపై చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి నిబంధనల అమలుపై స్పష్టత వచ్చాక ఏపీ కేబినెట్ లో బిల్లును ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్నినెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో 10 శాతం కోటా అమలుపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని, ఆ తరువాతే ఎన్నికల్లోకి వెళ్లాలనే యోచనలో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 10 శాతం కోటా అమలుపై కేంద్రం చట్టంలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త చట్టంపై లోతుగా అధ్యయనం చేసి ఆ తరువాతే అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం కలిగిన ఎగువ తరగతులవారికి క్రిమీలేయర్ ను తగ్గించి వారిని కూడా నిరుపేదల కోటాకు అర్హులు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పేదలకు కూడా ఈ కోటాను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించనట్టు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు రాష్ట్ర వర్గాలు సమాచారం.
ఎన్డీఏ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ, మరుసటి రోజు కేసీఆర్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ముస్లింలు సహా మైనార్టీలకు కూడా 12 శాతం రిజర్వేషన్ కోటా పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తమ పథకాలతో కలిగే ప్రయోజనాలను పేద ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.