చుక్కలు చూపిస్తున్న ధరణి సర్వర్.. సవాల్‌గా మారిన స్లాట్ బుకింగ్, ప్రహసనంగా రిజిస్ట్రేషన్లు

server problems for dharani portal: ధరణి పోర్టల్‌కు కంప్యూటర్ కష్టాలు తప్పడం లేదా..? ధరణి సర్వర్ బిజీ.. స్లాట్ బుకింగ్‌లకు శాపంగా మారిందా..? రాష్ట్రంలో మళ్లీ ఊపందుకుంటాయనుకున్న రిజిస్ట్రేషన్లకు బాలారిస్టాలు తప్పడం లేదా..? అవును.. ప్రస్తుతం తహసీల్ కార్యాలయల దగ్గర ఇదే సీన్ కనిపిస్తుంది. సర్వర్ డౌన్‌తో ఒకటి అరా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి కావడం లేదు.
రెవెన్యూ ప్రక్షాళనకు కొత్త చట్టం:
రాష్ట్రంలో రెవెన్యూ ప్రక్షాళనకు నడుం బిగించిన కేసీఆర్ ప్రభుత్వం.. కొత్త రెవెన్యూ చట్టంతో పని మొదలు పెట్టింది. ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళం భూమి లెక్కలను ధరణిలో చేర్చాలని డిసైడ్ అయ్యింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములుగా విభజించిన ప్రభుత్వం.. ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 2న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించి.. అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపారు.
చుక్కులు చూపిస్తున్న కంప్యూటర్:
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గతం కంటే ఎంతో సులభతరంగా మారింది. కానీ అది అమలు కావడంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ హ్యాపీగా ఉంటుందని భావించిన వారికి కంప్యూటర్ చుక్కలు చూపిస్తోంది. రిజిస్ట్రేషన్లను పది నిమిషాల్లో పూర్తి చేసుకోవాలని ఆశపడ్డ వారికి.. ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో మీ-సేవ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సింపుల్‌గా ఉంటుందనుకున్నది చికాకుగా తయారైందంటున్నారు జనం.
పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడీ ఈ-స్లాట్ బకింగ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకుంటున్నా వారికి సవాల్‌గా మారింది. ఫోన్‌లో పని కావడం లేదని.. మీ సేవ కేంద్రాలకు వెళ్తే.. అదే సీన్ రిపీట్ అవుతోంది. కంప్యూటర్ సర్వర్ బీజీ కారణంగా.. స్లాట్ బుకింగ్ కావడం లేదంటున్నారు మీ సేవ నిర్వాహకులు.
రిజిస్ట్రేషన్ చేయడానికి తహసీల్దార్లు సిద్ధంగా ఉన్నా రైతులు రావడం లేదు:
సర్వర్ బిజీతో స్లాట్లు బుకింగ్ కాకపోవడంతో.. రిజిస్ట్రేషన్ చేయడానికి తహసీల్దార్లు సిద్ధంగా ఉన్నా రైతులు రావడం లేదు. మరోవైపు పోర్టల్‌లో చిన్నచిన్న టెక్నికల్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అయితే మొదట్లో ఇలాంటివన్నీ సహజమని.. ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నామంటున్నారు అధికారులు.
మొత్తానికి సంస్కరణలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం పెంచుదామని భావించిన ప్రభుత్వానికి సర్వర్ బిజీ.. సవాల్‌గా మారింది. అయితే ఏ పని ప్రారంభించినా కొత్తలో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు తప్పవంటున్నారు అధికారులు. ఇవన్నీ తొందరలోనే తొలిగిపోతాయని అంటున్నారు. రైతులను గింగిరాలు తిప్పుతున్న ఈ సర్వర్ కష్టాలు తీరెదెప్పుడో చూడాలి మరి.