రుణమాఫీ పొందే రైతుల సంఖ్య ఎంత ?

ఖరీఫ్ రాబోతుండటంతో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో రుణమాఫీ అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు అధికారులు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు మాఫీకి అర్హులను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఇంతకీ రుణమాఫీ పొందే రైతుల సంఖ్య ఎంత..? బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తమెంత..?
ఎన్నికల హామీలపై దృష్టిసారించింది కేసిఆర్ సర్కార్. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల సమాచారం సేకరిస్తున్నారు. రుణం తీసుకున్న వారిని గుర్తించేందుకు 2017-19 సంవత్సరాల వానాకాలం, యాసంగిలో రుణాలు తీసుకున్న రైతులను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
రెండేళ్లలో రైతులు తీసుకున్న పంట రుణాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 40 లక్షల మంది రైతులు అర్హులవుతారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అర్హులను గుర్తించిన తర్వాత విధివిధానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. నిబంధనలు ఖరారైతే వానాకాలం సీజన్ ప్రారంభానికంటే ముందే రుణమాఫీ ఓ కొలిక్కి వస్తుంది. గత టర్మ్‌లో 35 లక్షల మంది రైతులకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేశారు. ఈసారి వారి సంఖ్య పెరగడంతో 40 లక్షల మంది రైతుల రుణమాఫీకి 20 వేలకోట్లపైనే ఖర్చవుతుందని సర్కార్ లెక్కలు వేసుకుంటోంది.
మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాత మే- జూన్ నెలల్లో రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతోపాటు ఆసరా పింఛన్ల వంటి సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నందున వ్యవసాయ రుణాల మాఫీని విడతలవారీగా అమలుచేసే అవకాశం ఉంటుందంటున్నారు. రైతులు యాసంగికి సంబంధించిన పంట రుణాలను అక్టోబర్- డిసెంబర్ మధ్యలో బ్యాంకులకు చెల్లించి తిరిగి కొత్త రుణాలు తీసుకుంటారు. ఐతే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదురుచూస్తున్న రైతులు.. బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులను నిలిపివేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీకి 20వేల కోట్లు, ఎకరానికి 10 వేల చొప్పున రైతుబంధు పథకానికి మరో 15 వేలకోట్లు కావాల్సి ఉంటుంది. ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 35 వేలకోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో పంట రుణాలు తీసుకున్న రైతులను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 39 లక్షల 11 వేల మంది రుణాలు పొందారు. వానాకాలంలో 26 లక్షల 20 వేల మందికి, యాసంగిలో 12 లక్షల 90 వేల మందికి మొత్తం 31 వేల 410 కోట్ల రుణాలను మంజూరు చేశాయి బ్యాంకులు. 2018-19లో ఇప్పటివరకు 26 లక్షల 45 వేల మందికి 23 వేల 488 కోట్ల రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. వానాకాలంలో 22 లక్షల 21 వేల మందికి 19 వేల 671 కోట్లు మంజూరు చేశారు. వానాకాలం, యాసంగి రుణాలు కలిపి ఈసారి మొత్తం 33 వేల కోట్ల రూపాయలని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత టర్మ్‌లో సుమారు 17 వేల 250 కోట్లు మాఫీ కాగా.. ఈసారి ఆ మొత్తం దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రుణమాఫీ చేయాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.