టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనమేనా : ప్రధాన ప్రతిపక్షం MIM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయామా..? ఆ స్థానాన్ని కేసీఆర్ ఓవైసీకి గిఫ్ట్‌గా అందించబోతున్నారా…? విపక్షాన్ని విలీనం చేసుకుని మిత్రపక్షాన్ని ప్రతిపక్షంగా మార్చబోతున్నారా…? అసలు TRS స్ట్రాటజీ ఏంటి..? తెలంగాణ అసెంబ్లీ చిత్ర విచిత్రానికి వేదిక కాబోతుంది. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడం ద్వారా ఇది సాకారాం అయ్యేలా ఉంది. ఇప్పటికే 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 11 మంది టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. మరో ఇద్దరిని చేర్చుకుని.. సీఎల్పీని విలీనం చేసేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇటీవల 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో గూటికి చేరారు. మరో ముగ్గురు కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వారు కూడా కారెక్కితే.. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో కలిపేందుకు రూట్ క్లియర్ అయినట్లేనని చెప్పాలి. అప్పుడు శాసనసభలో కాంగ్రెస్‌కు 5 లేదా 6 గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. అదే జరిగితే అసెంబ్లీలో కొత్త దృశ్యం ఆవిష్కృతం కానుంది. టీఆర్ఎస్ తర్వాతి స్థానాన్ని ఎంఐఎం సొంతం చేసుకోనుంది. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి ఒకరు, టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
అసెంబ్లీలో పార్టీలకు ఉండే సంఖ్యాబలం ప్రకారం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఏంఐఏం పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుంది. ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి టీఆర్ఎస్‌కు మిత్ర పక్షంగా కొనసాగుతుంది. సీఎల్పీ విలీనం జరిగితే టీఆర్ఎస్ ఉన్న మిత్రపక్షమే ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది. అసెంబ్లీ రూల్స్ ప్రకారం అధికార పార్టీ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీకే ఎక్కువ మాట్లాడే అవకాశం దక్కుతుంది. మొత్తానికి టీఆర్ఎస్ అనుకున్నది అనుకున్నట్లు విలీన ప్రక్రియ జరిగితే పాతబస్తికే పరిమితమైన ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.