తెలంగాణ కరోనా ఆస్పత్రుల్లో బాధితులకు ఏ దశలో.. ఏయే మందులు ఇస్తున్నారంటే?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మరో 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకి ఆస్ప్రతిలో చేరిన బాధితులను వైద్య సిబ్బంది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన మందులతోపాటు మనోస్థైరాన్ని కూడా కల్పిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే చాలా మందిలో దగ్గు, జ్వరం, జలుబు వంటి సాధారణ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు గాంధీ కరోనా నోడల్ సెంటర్ ఇంచార్జి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాజారావు.
కరోనా బాధితులకు అవసరమైన మందులను ఎలా వాడుతున్నారో కూడా డాక్టర్ రాజారావు వివరించారు. కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ స్టేజీ నుంచి దశలవారీగా మందులను వాడుతున్నట్టు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఛాతీ ఎక్సరే, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు, రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువమందికి వైరస్ లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నామన్నారు. జ్వరం ఉంటే క్రోసిన్ లేదా పారసిటమాల్ ఇస్తున్నామని చెప్పారు. జలుబు ఉంటే ‘సిట్రజిన్’ టాబ్లెట్లు ఇస్తున్నామని, లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత నుంచి బాధితులకు విటమిన్ సీ, బీ కాంప్లెక్స్ వంటి మందులు ఇస్తున్నామని వివరించారు.
ఇక, దగ్గు, జలుబు, జ్వరం వంటి తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రోజుకు రెండు సార్లు ‘హైడ్రాక్సీ క్లోరిన్’ టాబ్లెట్స్ ఇస్తున్నామని రాజారావు తెలిపారు. హెచ్‌ఐవీ ట్రీట్ మెంట్లో వాడే ‘లోపినవీర్ సహా రిటోనవీర్’ కాంబినేషన్ మందులను కూడా ఇస్తున్నట్టు చెప్పకొచ్చారు. రెండు రోజుల తర్వాత డోస్ తగ్గించి మరో రెండు రోజుల పాటు అవే మందులు వాడుతున్నామని అన్నారు. (ఒక్కరోజే 84వేల కరోనా కేసులు…ఒక్క న్యూయార్క్ లోనే ఏ దేశంలో లేనన్ని కేసులు)
కరోనా నాలుగో స్టేజ్‌లో ఉన్న వాళ్లను ఐసీయూకు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఆస్పత్రిలో స్పెషలిస్టులందరూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రొటోకాల్ ట్రీట్‌మెంట్‌తో పాటు వారి కండిషన్‌ను బట్టి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, హార్ట్ పనితీరులో ఏమైనా లోపాలుంటే వెంటనే సంబంధిత మందులు ఇస్తున్నారు. బీ కాంప్లెక్స్, విటమిన్ సీ వంటి టాబ్లెట్స్ కూడా బాధితులకు ఇస్తున్నారు.