భానుడి భగభగలు : ఖానాపూర్‌లో 44.4 డిగ్రీలు

సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌తో పాటు మంచిర్యాల జిల్లా నర్సాపూర్ పాల్తె, ఖానాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగ్గాసాగర్, నేరెళ్ల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోనూ ఎండలు మండిపోయాయి. ఏప్రిల్ 11వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎండల ప్రభావం ఓటింగ్‌పై కనిపించింది.
రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షణ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.