ఆర్టీసీ సమ్మె : సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ

  • Published By: madhu ,Published On : October 16, 2019 / 01:53 PM IST
ఆర్టీసీ సమ్మె : సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ

Updated On : October 16, 2019 / 1:53 PM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పాల్గొన్నారు.

సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు, సమ్మె ప్రభావం..,అక్టోబర్ 19వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమౌతుండడం..అదే రోజు బంద్‌కు పిలుపునివ్వడం..తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మెపై బుధవారం మంత్రి పువ్వాడ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ, ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులన్నీ నడుపాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యధికంగా 80 శాతం, రాష్ట్రంలో సగటున 60.48 శాతం ఆర్టీసీ బస్సులు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని, షెడ్యూల్ ప్రకారం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్ డిపోలకు వెళ్లి బస్సులను తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ మిషన్లు అందుబాటులో ఉంచాలని, షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు బస్సులను నడపాలని ఆదేశించారు.  ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ లేదు.

అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్‌.. వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమన్నారు. 
Read More : చర్చలకు పిలవలేదు : ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది