పరిషత్ పోరు : మొదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. తొలి విడతలో 197 జెడ్పీటీసీ.. 2వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఎంపీటీసీ స్థానాలకు 7వేల 72మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 3 విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 32వేల 42 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 విడతల ఎన్నికల్లో 1,56,55,897 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.47 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 54వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు వేర్వేరు బ్యాలెట్లు అందుబాటులో ఉంచారు. ఎంపీటీసీ సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్, జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ కేటాయించారు. పార్టీలకు కేటాయించే గుర్తులతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు 100 రకాల గుర్తులను కేటాయించారు. ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటు వేయాలని అధికారులు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి ఇంక్‌తో గుర్తువేశారు. ఈ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలికి సిరాతో గుర్తు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు.