మొబైల్ సిగ్నల్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్

ట్రాఫిక్ ఆంక్షలు విధించడంలోనే కాదు.. సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చారు. ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్‌లో కొత్త పద్ధతిని మొదలుపెట్టనున్నారు. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్ సైకిల్స్ ఉంటున్నాయి. జంక్షన్‌లోని ఓ రోడ్‌కు గ్రీన్‌లైట్ ఆగి రెడ్‌లైట్ పడిన తర్వాత మళ్లీ గ్రీన్‌లైట్ పడటానికి పట్టే సమయం ఇది. ఆ జంక్షన్ వరకూ మాత్రమే కాదు. సిగ్నల్ లైట్ ఆ రూట్ మీదనే కాదు మరో వైపు ప్రభావం చూపిస్తోంది. ఆయా జంక్షన్లలోని కొన్ని రోడ్లు ఖాళీగా, మరికొన్ని బంపర్ టు బంపర్ జామ్‌తో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి.
ఈ సమస్య విద్యాసంస్థలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేట్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో మరింత రద్దీగా కనిపిస్తున్నాయి. దీనికి ట్రాఫిక్ విభాగం లేటెస్ట్ టెక్నాలజీతో పరిష్కారాన్ని ఆలోచించింది. ఏ జంక్షన్‌లో ఎంత ట్రాఫిక్ ఉందనేది సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా పసిగట్టేస్తారు. దీంతో ఆ రూట్‌లకు ఎంత సమయం వేచి ఉండాలనేది నిర్ణయిస్తారు. మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న గూగుల్ యాప్స్ ఆధారంగా సిగ్నల్‌ను కనుగొంటారు. అదెలా అంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. దానిని బట్టి గూగుల్ ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఉందో చెప్పేస్తుంది. ఇలా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుంది.
ఏపీఐ కోసం ఆ సంస్థతో ఒప్పందం:
గూగుల్ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం యోచించింది. దీంతో ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో కూడిన గూగుల్ సర్వర్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసే సర్వర్ అప్లికేషన్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది అమల్లోకి రావడంతో గూగుల్ సర్వర్ ఆధారంగా ఓ జంక్షన్ సమీపంలోని రహదారుల్లో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. దీంతో ఓ జంక్షన్‌కు సంబంధించి రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ వెలుగుతుంది. రద్దీని బట్టి ఆయా మార్గాల్లో సిగ్నల్స్ సైకిల్‌ను సర్వర్ మార్చేస్తూ ఉంటుంది.
ఇప్పటికే ఈ విధానాన్ని గచ్చిబౌలి చౌరస్తాలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. విజయవంతం కావడంతో 3 కమిషనరేట్లలోని దాదాపు అన్ని జంక్షన్లలోనూ వినియోగించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహిస్తున్న బెల్ సంస్థ కాంట్రాక్ట్ నవంబర్‌లో పూర్తయి కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. గూగుల్ సంస్థ సహకారంతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండే సర్వర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.